- ఐవోఎస్ 16 వెర్షన్ నుంచి అందుబాటులోకి
- ఐప్యాడ్, మ్యాక్ బుక్ లకు సైతం
- నిఘా సంస్థల స్పైవేర్ల నుంచి డేటాకు రక్షణ
యాపిల్ మరో కొత్త ఫీచర్ ను ప్రకటించింది. ఐ ఫోన్, ఐప్యాడ్, యాపిల్ మ్యాక్ బుక్ కు లాక్ డౌన్ మోడ్ జత చేస్తున్నట్టు తెలిపింది. బలమైన స్పైవేర్ లు సైతం యాపిల్ ఉత్పత్తుల నుంచి డేటాను కొట్టేయకుండా ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఐవోస్ 16, ఐప్యాడ్ ఓఎస్ 16, మ్యాక్ ఓఎస్ వెంచురా అప్ డేట్స్ తో కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
డిజిటల్ ముప్పు ఎదుర్కొనే కొద్ది మందికి లాక్ డౌన్ మోడ్ అన్నది ఐచ్ఛిక రక్షణ ఫీచర్ గా ఉపయోగపడుతుందని తెలిపింది. యాపిల్ తాజా ఫీచర్ .. ప్రభుత్వ నిఘా స్పైవేర్ ల నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో అభివృద్ధి చేసినది కావడం గమనార్హం. ఇజ్రాయెల్ పెగాసస్, ఇతర ప్రభుత్వ ప్రాయోజిత స్పైవేర్ ల బారిన పడకుండా ఐఫోన్ యూజర్లు తమ డేటాను లాక్ డౌన్ మోడ్ తో రక్షణ కల్పించుకోవచ్చు.
అంతేకాదు తాను అభివృద్ధి చేసిన లాక్ డౌన్ మోడ్ ను బైపాస్ చేసి, మొబైల్ ఫోన్లలోకి చొచ్చుకుపోయే మార్గాలను గుర్తించిన వారికి రివార్డు సైతం ఇస్తానని యాపిల్ ప్రకటించింది. ఇందుకోసం పరిశోధకులకు ఆహ్వానం పలికింది. యాపిల్ తన ఐఫోన్ యూజర్లకు అత్యంత భద్రత కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్న సంగతి తెలిసిందే.