Britain: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా
- వివాదాస్పద ఎంపీకి మంత్రి పదవి ఇచ్చిన జాన్సన్
- బోరిస్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన కేబినెట్ మంత్రులు
- అయినా పట్టించుకోకుండా ముందుకు సాగిన బ్రిటన్ ప్రధాని
- మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆర్థిక మంత్రి రిషి సునాక్
- గురువారం నాటికి 52కు చేరిన రాజీనామాలు
- ప్రజా ఆందోళనలు మొదలవడంతో రాజీనామా చేసిన బోరిస్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టేదాకా ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు. ఈ మేరకు బ్రిటన్‌లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వివాదంలో చిక్కుకున్న ఎంపీ క్రిస్ పించర్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవడంతో జాన్సన్‌పై ఆయన కేబినెట్ మొత్తం అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రుల అసంతృప్తిని అంతగా పట్టించుకోని బోరిస్.. ముందుకు సాగిపోయారు.
ఈ క్రమంలో జాన్సన్ కేబినెట్‌లో కీలక మంత్రులుగా కొనసాగుతున్న ఆర్థిక మంత్రి రిషి సునాక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావెద్ లు తమ పదవులకు రాజీనామా చేశారు. జాన్సన్ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగానే తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా వారు ప్రకటించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా జాన్సన్ కేబినెట్‌లోని మంత్రులు రాజీనామా బాట పట్టారు. గురువారం ఉదయం నాటికి రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య 52కు చేరిపోయింది. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపించాయి. ఫలితంగా బోరిస్ ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు.