TDP: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం... దాని ప్రత్యేకతలేమిటో చెప్పిన టీడీపీ అధినేత
- మదనపల్లె టీడీపీ మినీ మహానాడుకు హాజరైన చంద్రబాబు
- చంద్రబాబు చూపుడు వేలికి కనిపించిన ప్లాటినం ఉంగరం
- ఉంగరంపై టీడీపీ శ్రేణుల్లో అమితాసక్తి
- పార్టీ నేతల వినతితో ఉంగరం ప్రత్యేకతలు వెల్లడించిన చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆహార్యం చాలా సాదాసీదాగా ఉంటుందన్న విషయం తెలిసిందే. చేతికి గడియారం గానీ, వేళ్లకు ఉంగరాలు గానీ, రోజుకో రీతిన డ్రెస్సింగ్ గానీ ఆయనలో కనిపించవు. ఎప్పుడూ ఒకే రకం కలర్ షర్ట్, ప్యాంట్‌తో కనిపించే చంద్రబాబులో ఇప్పటిదాకా పెద్దగా మార్పేమీ లేదనే చెప్పాలి.
అయితే తాజాగా ఆయన వేలికి ఓ ప్లాటినం ఉంగరం కనిపించింది. బుధవారం అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లెలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా చంద్రబాబు చూపుడు వేలికి ప్లాటినం ఉంగరం కనిపించింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనగా... సమావేశం తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ నేతల వినతి మేరకు చంద్రబాబు ఆ ఉంగరం ప్రత్యేకతలను వివరించారు.
తన వేలికి ప్లాటినం ఉంగరం కొత్తగా చేరిన మాట వాస్తవమేనని చెప్పిన చంద్రబాబు.. అది కేవలం ఉంగరం మాత్రమే కాదని, అది తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసే పరికరమని చెప్పారు. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉందని... అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం.. తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని చెప్పారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికప్పుడు తన కంప్యూటర్‌కు పంపుతుందని కూడా చంద్రబాబు తెలిపారు.
రోజూ నిద్ర లేచిన వెంటనే కంప్యూటర్లో ప్లాటినం ఉంగరం పంపిన రిపోర్ట్ చెక్ చేసుకుంటానని, రోజువారీగా జరగాల్సిన చర్యల్లో ఏది తప్పుగా ఉందన్న విషయాన్ని అది ఇట్టే చెప్పేస్తుందని ఆయన వెల్లడించారు. ఆ నివేదికను చెక్ చేసుకుని నిన్న ఏం తప్పు చేశామన్న విషయాన్ని గుర్తించి... అది మరలా పునరావృతం కాకుండా చూసుకుంటూ తన ఆరోగ్యాన్నికాపాడుకుంటానని ఆయన తెలిపారు.
పనిలో పనిగా టీడీపీ కార్యకర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు. టీడీపీ కార్యకర్తలంటే తనకు కుటుంబ సభ్యులతో సమానమని చెప్పిన చంద్రబాబు... తన మాదిరే ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.