Sai Pallavi: నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురు దెబ్బ... నటి క్వాష్ పిటిషన్ కొట్టివేత
- విరాటపర్వం ప్రమోషన్ సందర్భంగా సాయిపల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు
- భజరంగ్ దళ్ నేతల ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పీఎస్‌లో కేసు నమోదు
- గత నెల 21న సాయి పల్లవికి నోటీసులు జారీ చేసిన పోలీసులు
- నోటీసులను రద్దు చేయాలంటూ హైకోర్టులో సాయి పల్లవి పిటిషన్
టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో ప్రముఖ నటిగా ఎదిగిన సాయి పల్లవికి గురువారం తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఓ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలంటూ సాయిపల్లవి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. తన తాజా చిత్రం విరాటపర్వం చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా కశ్మీరీ పండిట్ల హత్యలు, గో హత్యలను ప్రస్తావించిన సాయి పల్లవిపై భజరంగ్ దళ్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో సాయి పల్లవిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో సాయి పల్లవికి సుల్తాన్ బజార్ పోలీసులు గత నెల 21న నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను రద్దు చేయాలంటూ సాయి పల్లవి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు... పోలీసుల నోటీసులను రద్దు చేసేందుకు నిరాకరించింది. సాయి పల్లవి అభ్యర్థనను తిరస్కరిస్తూ ఆమె పిటిషన్‌ను కొట్టేసింది.