Twitter: ట్విట్టర్లో 100 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్!
- తొలగించినట్టు ధ్రువీకరణ
- టాలెంట్ అక్విజిషన్ టీమ్ సైజు 30 శాతం తగ్గింపు
- వ్యయాలు తగ్గించుకునే దిశగా వరుస చర్యలు
- మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లినా ఇదే పరిస్థితి
ఎలాన్ మస్క్ చేతికి వెళ్లనున్న ట్విట్టర్లో అప్పుడే విపత్తు మొదలైందా..? చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఉద్యోగుల తగ్గింపును ట్విట్టర్ మొదలు పెట్టింది. తాను ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగులను తగ్గిస్తానని టెస్లా అధినేత మస్క్ లోగడ ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ట్విట్టర్ తన ‘టాలెంట్ అక్విజిషన్ టీమ్’ సైజును 30 శాతం తగ్గించినట్టు సమాచారం. నిపుణులైన మానవ వనరులను ఉద్యోగాల్లోకి తీసుకునే బాధ్యతలను ఈ టీమ్ చూస్తుంటుంది.
100 మందిని తొలగిస్తున్నట్టు ట్విట్టర్ సైతం అంగీకరించింది. వ్యయాలు తగ్గించుకునేందుకు ట్విట్టర్ ఇప్పటికే నియామకాలను నిలిపివేసింది. దీనికితోడు ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా కొంత కుదించి, టెస్లాకు విక్రయించేందుకు మార్గం సుగమం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు మస్క్ తో విక్రయ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ట్విట్టర్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఫేక్ ఖాతాల లెక్క తేలితే కానీ కొనుగోలు చేయనంటూ మస్క్ భీష్మించుకుని కూర్చున్నాడు. మస్క్ తన సొంత సంస్థ టెస్లాలోనూ ఉద్యోగుల తగ్గింపుపై దృష్టి సారించడం తెలిసిందే.