waterfall: హైదరాబాద్ కు అతి సమీపంలోనే సుందర జలపాతం
- పర్యాటకులను ఆకర్షిస్తున్న అంతరగంగ జలపాతం
- అబ్దుల్లాపూర్ మెట్ కు సమీపంలోని అటవీ ప్రాంతంలో
- కొంత దూరం పాటు ట్రెక్కింగ్ చేస్తేనే చేరుకోగలరు
పట్టణ వాసులు వీకెండ్ లో కాస్త విశ్రాంతి కోసం ప్రయత్నిస్తుంటారు. జూ పార్క్, బిర్లా టెంపుల్.. కాస్తంత స్తోమత ఉంటే లాంగ్ డ్రైవ్.. ఆధ్యాత్మిక, భక్తి భావన ఉన్న వారికి పుణ్య క్షేత్రాలు, వినోదం కోసం థియేటర్లు ఇలా ఎవరి అభిరుచి వారిదే.
కొందరు అప్పుడప్పుడు బయటి ప్రాంతాలను చూసేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే, జలపాతాలంటే ఇష్టపడని వారు ఉండరు. వీటి కోసం వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి దూర ప్రాంతాల వరకు వెళ్లనవసరం లేదు. అందుకు హైదరాబాద్ కు అతి సమీపంలోనే సుందరమైన ‘అంతరగంగ జలపాతం’ ఉంది.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత.. అబ్దుల్లా పూర్ మెట్ కూడా దాటిన తర్వాత జాతీయ రహదారి నుంచి ఎడమ చేతి వైపు కొంత దూరం పాటు లోపలికి ప్రయాణించాల్సి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా కవాడి పల్లి గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇది ఉంది.
ఇక్కడి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతం సందడిగా మారిపోయింది. కాకపోతే జలపాతాన్ని చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేయాలి. కనుక యూత్ కు ఇదొక మంచి స్పాట్. ముఖ్యంగా వర్షకాలంలోనే ఈ ప్రాంతం ఎంతగానో కనువిందు చేస్తుంటుంది.