Sensex: వారంలోనే సెన్సెక్స్ 1,700 పాయింట్ల ర్యాలీ.. అసలేం జరుగుతోంది?
- ఒక్క వారంలో మారిపోయిన వాతావరణం
- అంతర్జాతీయంగా దిగొస్తున్న కమోడిటీల ధరలు
- సెంట్రల్ బ్యాంకులు దూకుడుగా వ్యవహరించబోవన్న నమ్మకం
- అప్రమత్తంగా వ్యవహరించాలంటున్న విశ్లేషకులు
ఈ వారంలో ఈక్విటీ మార్కెట్లు మంచి ర్యాలీ చేశాయి. గరిష్ఠాల నుంచి 20 శాతం వరకు పడిపోయిన తర్వాత కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఈ వారం ఐదు సెషన్లలో సెన్సెక్స్ 1,700 పాయింట్ల వరకు ర్యాలీ చేసింది. శుక్రవారం విడుదల కానున్న ఐటీ కంపెనీ టీసీఎస్ ఫలితాలను ఇన్వెస్టర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. నేటి నుంచి మొదటి త్రైమాసికం ఫలితాల సీజన్ మొదలవుతోంది.
టీసీఎస్ యాజమాన్యం సమీప భవిష్యత్తు వృద్ధి గురించి చేసే వ్యాఖ్యలు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లు అధిక అమ్మకాల పరిధిలో ఉన్నట్టు చెబుతున్నారు. ‘‘సూచీలు ఇటీవలి కనిష్ఠాల నుంచి రికవరీ తీసుకున్నాయి. స్థూల ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉండడంతో మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. కమోడిటీల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో సెంట్రల్ బ్యాంకులు అనుకున్నంత వేగంగా వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత ర్యాలీకి నేపథ్యం ఇదే. దీనికితోడు షార్ట్ కవరింగ్ కూడా తోడైంది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ తెలిపారు.
గతంలో అంత దూకుడుగా సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయకపోవచ్చని విజయ్ కుమార్ పేర్కొన్నారు. కనుక కమోడిటీల ధరలను పరిశీలించాల్సి ఉంటుందన్నారు. అయితే, ఈ స్థాయిలో మార్కెట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నది కొందరు విశ్లేషకుల సూచన. డౌన్ ట్రెండ్ లో దీన్ని రిలీఫ్ ర్యాలీగానే చెబుతున్నారు. నిఫ్టీ 16,500కు పైన నిలదొక్కుకుంటేనే అప్ ట్రెండ్ గా భావించొచ్చని అంటున్నారు.