Shinzo Abe: షింజో అబే గుండెను ఓ బుల్లెట్ ఛిద్రం చేసింది: వెల్లడించిన వైద్యులు

Doctors said one bullet ruptures Shinzo Abe heart

  • జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య
  • దేశవాళీ తుపాకీతో కాల్చిన వ్యక్తి
  • గుండెకు పెద్ద రంధ్రం పడిందన్న డాక్టర్లు
  • మరణానికి అదే కారణమని వెల్లడి

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనతో అనుబంధం ఉన్న ప్రపంచ నేతలు తీవ్ర విషాదానికి గురయ్యారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో ఈ ఘాతుకం జరిగింది. 

పార్లమెంటు ఎగువ సభ ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో షింజో అబే మాట్లాడుతుండగా, వెనుకగా వచ్చిన దుండగుడు దేశవాళీ తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన అబేను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. 

కాగా, ఓ బుల్లెట్ షింజో అబే గుండెను నేరుగా తాకిందని, దాంతో ఆయన గుండె ఛిద్రమైందని చికిత్స అందించిన డాక్టర్లు వెల్లడించారు. గుండె భాగంలో పెద్ద రంధ్రం పడిందని వివరించారు. ఆయన మరణానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఓ బుల్లెట్ గుండెను తాకగా, మరో బుల్లెట్ ఆ గాయాన్ని మరింత క్లిష్టతరం చేసిందని వివరించారు. 

షింజో అబేను అసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురైన స్థితిలో ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించామని వివరించారు. రక్తం కూడా ఎక్కించామని తెలిపారు. ఏదీ ఫలితాన్నివ్వలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు.

కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... దుండగుడు తొలిసారి కాల్చినప్పుడు అందరూ బొమ్మ తుపాకీ కాల్పులు అనుకున్నారని ఓ యువతి తెలిపింది. అప్పటికి షింజో అబే కిందపడిపోలేదని, కానీ రెండో రౌండ్ కాల్చాక ఆయన నేలకొరిగారని వివరించింది. రెండో రౌండ్ కాల్చడం స్పష్టంగా కనిపించిందని, తుపాకీ నుంచి నిప్పులు రావడంతోపాటు, పొగ కూడా వెలువడిందని, దాంతో అవి నిజం కాల్పులేనని అర్థమయ్యాయని ఆమె వెల్లడించింది. కిందపడిపోయిన షింజే అబే అచేతనంగా కనిపించడంతో, పలువురు ఆయన ఛాతీపై మర్దన చేశారని పేర్కొంది. కాగా, షింజే అబేపై కాల్పులు జరగడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News