Rahul Gandhi: హస్తినలో లాలూ ప్రసాద్ యాదవ్ ను పరామర్శించిన రాహుల్ గాంధీ
- ఇటీవల తన ఇంట్లో జారిపడిన లాలూ
- విరిగిన కుడిభుజం ఎముక
- ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీ తరలింపు
- ఎయిమ్స్ లో చికిత్స
- లాలూ త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్ష
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (74) ఇటీవల తన ఇంట్లో జారిపడడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. సీనియర్ రాజకీయవేత్త లాలూను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
కాగా, లాలూ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. మరికొన్నిరోజుల్లోనే క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి జనరల్ రూముకు మార్చుతారని వివరించారు.
లాలూతో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ అనుబంధం ఉంది. బీహార్ లో కాంగ్రెస్ పార్టీ, లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ మిత్రపక్షాలు 2004లో యూపీఏ పాలన సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా సేవలందించారు. ఇటీవల పాట్నాలోని తన నివాసంలో జారిపడడంతో కుడి భుజం విరిగింది. దాంతో ఆయనను పాట్నా నుంచి ఢిల్లీకి ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించారు.