Rajamahendravaram: ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. అటవీశాఖ అధికారికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించిన రాజమండ్రి కోర్టు
- 2017లో మహిళా ఉద్యోగిని వేధించిన వెంకటేశ్వరరావు
- నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం
- జైలు శిక్షతోపాటు రూ. 12 వేల జరిమానా విధింపు
సహోద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించిన అటవీశాఖ అధికారికి రాజమహేంద్రవరం అదనపు జిల్లా జడ్జి ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష, 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన మల్లి వెంకటేశ్వరరావు 2017లో రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డివిజినల్ కార్యాలయంలో అటవీశాఖ అధికారిగా ఉన్నారు.
అదే ఏడాది జూన్‌లో సహోద్యోగినితో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో పలుమార్లు వాదనలు విన్న ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు నిందితుడు వెంకటేశ్వరరావును దోషిగా నిర్ధారించి 8 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 12 వేల జరిమానా విధించింది.