Amarnath: ఆ వాన అమర్ నాథ్ ఆలయం దగ్గర పడిందే.. హిమాలయాల్లో కురిసిన కుండపోత వర్షం కాదన్న వాతావరణ శాఖ
- అక్కడికక్కడ పడిన వానతోనే వరద ప్రవాహం
- ఎత్తయిన ప్రాంతం నుంచి దూసుకురావడంతోనే వేగంగా ప్రవాహం
- ఈ ఏడాది మొదట్లోనూ ఇలాంటి వాన కురిసి, వరద వచ్చిందన్న శ్రీనగర్ వాతావరణ అధికారి
అమర్ నాథ్ లో భారీగా వరద రావడానికి హిమాలయ పర్వతాల్లో కురిసిన కుండపోత వాన కారణం కాదని వాతావరణ శాఖ ప్రకటించింది. అమర్ నాథ్ ఆలయ సమీప ప్రాంతంలో అక్కడికక్కడ కురిసిన ఆకస్మిక వానతోనే ప్రవాహాలు పోటెత్తాయని తెలిపింది. అది కూడా అతి భారీ వాన కాదని.. కాస్త పెద్ద వర్షం మాత్రమేనని పేర్కొంది.
అమర్ నాథ్ వద్ద వచ్చిన వరదలతో 16 మంది మృతి చెందడం, మరో 40 మందికిపైగా గల్లంతవడం తెలిసిందే. అక్కడ వర్షాలు పడి, వరద వచ్చే అవకాశాన్ని ముందే ఎందుకు అంచనా వేయలేదన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంతో వాతావరణ శాఖ స్పందించింది.
వాన తక్కువే అయినా..
వరద వచ్చిన రోజున అమర్ నాథ్ ఆలయ సమీపంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల మధ్య కేవలం 31 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడిందని.. నిజానికి ఒక గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకుపైన కురిస్తేనే కుండపోత వర్షపాతంగా పేర్కొంటారని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. అయితే ఎత్తయిన ప్రాంతంలో వాన కురవడంతో నీటి ప్రవాహం వేగంగా వచ్చిందని వెల్లడించారు.
ఈ ఏడాది మొదట్లోనూ ఇలాంటి వాన
‘‘అమర్ నాథ్ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న కొండల్లో అక్కడికక్కడ కురిసిన వానతోనే అకస్మాత్తుగా వరద వచ్చింది. అక్కడికక్కడ కురిసిన కొద్దిపాటి మేఘాలే దీనికి కారణం. ఆ సమయంలో హిమాలయ ప్రాంతాల్లో అతి భారీ స్థాయిలో మేఘాలేమీ ఆవరించి లేవు. ఇంతకు ముందు ఈ ఏడాది మొదట్లో కూడా ఇలా స్థానికంగా వాన కురిసి వరద వచ్చింది” అని శ్రీనగర్ లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు.