Thief: తప్పించుకునేందుకు నాలుగో అంతస్తు నుంచి దూకిన దొంగ... అక్కడికక్కడే మృతి
- ముంబయిలో ఘటన
- అపార్ట్ మెంట్ లో చోరీకి యత్నం
- నాలుగో అంతస్తు వద్ద చిక్కుకుపోయిన వైనం
- పోలీసులకు భయపడి దూకిన దొంగ
ఓ అపార్ట్ మెంట్ లో చోరీకి వచ్చిన దొంగ పోలీసులకు దొరికిపోతానన్న భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబయిలోని వాంఖెడే స్టేడియం సమీపంలో జరిగింది. మెరైన్ డ్రైవ్ లోని డి రోడ్ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్ లో రోహిత్ అనే 26 ఏళ్ల యువకుడు చోరీకి వచ్చాడు. డ్రైనేజీ పైప్ లైన్ సాయంతో అతడు నాలుగో అంతస్తుకు చేరుకున్నాడు.
అయితే, అతడిని అపార్ట్ మెంట్ వాచ్ మన్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. కిందికి దిగే వీల్లేని స్థితిలో అతడు ప్రమాదకరరీతిలో అక్కడే చిక్కుకుపోయాడు. దాంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన ఆ దొంగ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణాలు విడిచాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. అపార్ట్ మెంట్ లోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ఆ దొంగపై అభియోగాలు మోపారు.