Ranil Wickremesinghe: శ్రీలంకలో అదుపుతప్పిన పరిస్థితులు... ప్రధాని ప్రైవేటు నివాసానికి నిప్పంటించిన ఆందోళనకారులు
- శ్రీలంకలో మరింత ముదిరిన సంక్షోభం
- కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం
- కొలంబో వీధుల్లోకి వేలమంది
- దేశాధ్యక్షుడి నివాసం ముట్టడి
- ఆపై ప్రధాని నివాసంలో విధ్వంసం
శ్రీలంకలో పరిస్థితులు అదుపుతప్పాయి. రాజధాని కొలంబోలో ప్రజాగ్రహం మిన్నంటింది. మొదట దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించిన ఆందోళనకారులు, ఆ తర్వాత ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. గేట్లు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించినా ఫలితంలేకపోయింది. వేలమంది ఒక్కసారిగా వచ్చిపడడంతో పోలీసులు నిస్సహాయులయ్యారు.
దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసాన్ని ఆందోళనకారులు ముట్టడించినప్పుడే ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రమాదాన్ని పసిగట్టారు. పదవికి రాజీనామా చేస్తానని, అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతుందని ప్రకటన చేశారు.
కానీ, తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమని తీవ్ర ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు విక్రమసింఘే కార్యాలయం నుంచి వెలువడిన ఆ ప్రకటనను ఏమాత్రం పట్టించుకోలేదు. విక్రమసింఘే ప్రైవేటు నివాసాన్ని ముట్టడించారు.