Andhra Pradesh: పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు
- తిత్లీ తుపాను పరిహారం విషయమై కలెక్టరేట్‌కు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు
- కార్యకర్తలను లోనికి అనుమతించని పోలీసులు
- తోపులాట అనంతరం లోనికి వెళ్లిన కార్యకర్తలు
- ఎస్సై ఫిర్యాదుతో కార్యకర్తలపై కేసులు
శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదైంది. అర్హులందరికీ తిత్లీ తుపాను పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌కు వెళ్లారు. అయితే, కలెక్టర్‌ను కలిసేందుకు అందరికీ అనుమతి లేదంటూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
అలా అడ్డుకున్న వారిని ఎంతసేపటికీ విడిచిపెట్టకపోవడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత కార్యకర్తలు లోపలికి వెళ్లారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఎస్సై ప్రవళ్లిక ఫిర్యాదు మేరకు 100 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.