Hyderabad: కణతకు రివాల్వర్ గురిపెట్టి వివాహితపై సీఐ అత్యాచారం.. ఆపై కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా ప్రమాదం
- రెండు రోజుల క్రితం ఘటన
- అర్ధరాత్రి బాధిత మహిళ ఇంటికి వెళ్లి దారుణం
- అప్పుడే ఇంటికొచ్చిన భర్తకు కూడా తుపాకి చూపి బెదిరింపులు
- కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా పేలిన కారు టైరు
- సీఐని సస్పెండ్ చేసిన కమిషనర్ సీవీ ఆనంద్
- పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు
భర్త లేని సమయంలో ఓ మహిళ ఇంటికి వెళ్లిన సీఐ కణతకు తుపాకి గురిపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త.. సీఐని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో తుపాకితో ఇద్దరినీ బెదిరించి కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారుకు ప్రమాదం జరగడంతో బాధితులిద్దరూ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చి సంచలనమైంది. ఆ సీఐ పేరు కె.నాగేశ్వరరావు. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సీఐని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిందితుడిని సస్పెండ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాలుగేళ్ల క్రితం బాధిత మహిళ భర్తను ఓ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో నాగేశ్వరరావే ఆయనను విచారించాడు. బెయిలుపై అతడు బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ శివారులో తనకున్న వ్యవసాయ క్షేత్రంలో మహిళ భర్తను నియమించుకున్నాడు. దంపతులిద్దరూ వేరే చోట ఉంటూ సీఐ పొలంలో పనిచేసేవారు.
ఈ క్రమంలో ఓ రోజు ఫామ్‌హౌస్‌కు వెళ్దామని బాధిత మహిళను పిలిచాడు. ఆమె ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది. వెంటనే అతడు సీఐకి ఫోన్ చేసి నిలదీశాడు. మీ భార్యకు చెబుతానని హెచ్చరించడంతో క్షమించమని వేడుకున్నాడు. అయితే, మహిళ భర్త తనను బెదిరించడాన్ని జీర్ణించుకోలేకపోయిన సీఐ నాగేశ్వరరావు కక్ష తీర్చుకునేందుకు సమయం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో ఒక రోజు బాధిత మహిళ భర్తను సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి రప్పించాడు. అతడి జేబుల్లో గంజాయి నింపి, చేతుల్లో గంజాయి సంచులు పెట్టి వీడియోలు, ఫొటోలు తీయించాడు. వాటిని చూపించి గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేస్తానని బెదిరించాడు.
దీంతో గతేడాది ఫిబ్రవరిలో బాధిత మహిళ భర్త ఫామ్‌హౌస్‌లో పనిమానేసి వనస్థలిపురంలో భార్యపిల్లలతో కలిసి అద్దెకుంటున్నాడు. అయితే, వారి కదలికలపై నిఘా పెట్టిన సీఐ బాధితురాలు ఒంటరిగా ఉన్నప్పుడు తన కోరిక తీర్చుకోవాలని భావించాడు. ఈ నెల 6న బాధితురాలికి ఫోన్ చేసి, తాను వస్తున్నానని, రెడీగా ఉండమని చెప్పాడు. ఆమె ఆ విషయాన్ని ఊర్లో ఉన్న భర్తకు చెప్పింది. వెంటనే అతడు ఊరి నుంచి బయలుదేరాడు.
మరోవైపు, ఆమె భర్త రాడనుకున్న నిందితుడు గురువారం రాత్రి బాధితురాలి ఇంటికి వెళ్లాడు. తలుపులు వేసి దాడిచేశాడు. ఆపై తలకు తుపాకి గురిపెట్టి అత్యాచారం చేశాడు. అర్ధరాత్రి దాటే వరకు అక్కడే ఉన్నాడు. అదే సమయంలో బాధితురాలి భర్త వచ్చి ఇంట్లో ఉన్న నాగేశ్వరరావును చూశాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కర్రతో సీఐపై దాడిచేశాడు. దీంతో తుపాకి తీసి చంపేస్తానని ఇద్దరినీ బెదిరించి కారులో ఎక్కించుకుని తన ఫామ్‌హౌస్‌కు బయలుదేరాడు. అయితే, ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై కారు టైరు పేలి ఆగిపోయింది. దంపతులిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి అరాచకాలు వెలుగుచూశాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో నాగేశ్వరరావు పరారయ్యాడు. అతడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.