Sri Lanka: శ్రీలంకలో సంక్షోభ పరిష్కారానికి రంగంలోకి దిగిన ఆర్మీ..
- శాంతియుత మార్గంలో పరిష్కారానికి అవకాశం ఉందంటూ ప్రకటన
- ప్రజలు సాయుధ దళాలకు, పోలీసులకు సహకారించాలని సూచన
- రక్షణ దళాల చీఫ్ నుంచి ప్రకటన విడుదల
శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభ పరిష్కారానికి చర్చలే మార్గమని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర శిల్వ ఆదివారం మాట్లాడుతూ.. శాంతియుతంగా సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చంటూ, శాంతి స్థాపనకు ప్రజల సహకారాన్ని అభ్యర్థించారు. వేలాదిగా ప్రజలు అధ్యక్ష భవనాన్ని ముట్టడించడంతో.. జులై 13న తన పదవి నుంచి తప్పుకుంటానని అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ప్రకటించడం తెలిసిందే.
ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రైవేటు వాహనానికి సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో రక్షణ దళాల చీఫ్ జనరల్ శవేంద్ర శిల్ప ప్రకటన చేశారు. శాంతియుత మార్గంలో సంక్షోభ పరిష్కారానికి అవకాశం లభించినట్టు చెప్పారు. దేశంలో శాంతి స్థాపనకు వీలుగా సాయుధ దళాలు, పోలీసులకు సహకారం అందించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
మూడు నెలలకు పైగా శ్రీలంకలో సంక్షోభం నెలకొనడం తెలిసిందే. తీసుకున్న విదేశీ రుణాలు చెల్లించలేక శ్రీలంక చేతులు ఎత్తేసింది. దీంతో కొత్తగా విదేశీ రుణాలు పుట్టడం ఆ దేశానికి అసాధ్యంగా మారిపోయింది. పెట్రోల్, ఆహారోత్పత్తుల దిగుమతులకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలోకి జారిపోయింది. దీంతో ప్రజలు అసహనంతో రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి అప్పు తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో జాప్యం నెలకొంది.