Droupadi Murmu: ఎల్లుండి ఏపీ సీఎం జగన్ నివాసానికి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము
- జులై 12న రాష్ట్రానికి వస్తున్న ముర్ము
- వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ
- సీఎం జగన్ నివాసంలో ముర్ముకు తేనీటి విందు
- ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన వైసీపీ
జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, బరిలో ఇద్దరు అభ్యర్థులే మిగిలారు. ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ రాష్ట్రాల నేతల మద్దతు సాధించేందుకు ముర్ము, సిన్హా ముమ్మరంగా పర్యటిస్తున్నారు.
ముర్ము ఎల్లుండి (జులై 12) ఏపీకి వస్తున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె సీఎం జగన్ నివాసానికి రానున్నారు. సీఎం జగన్ నివాసంలో ముర్ముకు తేనీటి విందు ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఇప్పటికే మద్దతు తెలిపింది. ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు.