Team World XI: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా టీమిండియా, వరల్డ్ ఎలెవన్ మ్యాచ్... బీసీసీఐకి ప్రతిపాదనలు పంపిన కేంద్ర ప్రభుత్వం
- 75 వసంతాల భారతదేశంలో వేడుకలు
- ఆగస్టు 22న మ్యాచ్ జరపాలని కేంద్రం ఆలోచన
- సాధ్యాసాధ్యాలపై బీసీసీఐకి ప్రతిపాదనలు
- చర్చిస్తున్న బీసీసీఐ
క్రికెట్ అభిమానులకు శుభవార్త. 75 వసంతాల స్వతంత్ర భారతావని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు జరుపుకుంటుండగా, అందులో భాగంగా టీమిండియా, వరల్డ్ ఎలెవన్ జట్లతో ఓ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం కేంద్రం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు ప్రతిపాదనలు పంపింది. ఆగస్టు 22న ఈ మ్యాచ్ జరపాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై బీసీసీఐతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోంది.
ఈ మ్యాచ్ లో టీమిండియా, వివిధ దేశాల అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం బీసీసీఐని కోరింది. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. ఈ మ్యాచ్ నిర్వహణ అంశం ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ ఆటగాళ్లను రప్పించడం ప్రయాసతో కూడుకున్న వ్యవహారం అని తెలిపారు. వారి ప్రయాణాలు, ఏర్పాట్లు ఎంతో క్లిష్టమైన విషయం అని పేర్కొన్నారు.
ప్రపంచ ఎలెవన్ జట్టును బరిలో దించాలంటే కనీసం 13 నుంచి 14 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు కావాలని, వాళ్లు అందుబాటులో ఉంటారో లేదో పరిశీలించాల్సి ఉందన్నారు. కేంద్రం మ్యాచ్ జరపాలనుకుంటున్న సమయానికి ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ జరుగుతుంటుందని, కరీబియన్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం అవుతుందని ఆ అధికారి వివరించారు. ఆయా లీగ్ లు వదులుకుని ఈ మ్యాచ్ కు వచ్చేందుకు ఆటగాళ్లకు పరిహారం చెల్లించే విషయం ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు.
కాగా, ఈ నెల 22 నుంచి 26 వరకు ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో ఐసీపీ వార్షిక సర్వసభ్య సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆటగాళ్లను మ్యాచ్ కు పంపేలా బీసీసీఐ ఇతర దేశాల క్రికెట్ బోర్డులను కోరనుంది.