EPFO: దేశంలో అందరికీ ఒకేసారి పెన్షన్ పడేలా.. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న ఈపీఎఫ్ వో
- మొత్తం 73 లక్షల మంది చందాదారులకు ఒకేసారి అందించాలని నిర్ణయం
- ఈ నెలాఖరులో తుది నిర్ణయం తీసుకోనున్న అధికారులు
- నకిలీ, నిరుపయోగ ఖాతాల ఏరివేతకు ఈ విధానం ఉపయోగపడుతుందని అంచనా
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ వో) దేశంలో చందాదారులు అందరికీ ఒకే సమయంలో పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఈ నెలాఖరున ‘కేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థ’ అమలుపై తుది నిర్ణయం తీసుకోనుంది. దాని ప్రకారం.. దేశవ్యాప్తంగా సుమారు 73 లక్షల మందికిపైగా ఈపీఎఫ్ పెన్షన్ లబ్ధిదారులకు ఒకే రోజున, ఒకే సమయంలో పెన్షన్ సొమ్ము అందే అవకాశం ఉండనుంది.
నకిలీల ఏరివేత లక్ష్యంగా..
దేశవ్యాప్తంగా మొత్తం 138 ఈపీఎఫ్ వో కార్యాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి ద్వారా వేర్వేరు తేదీల్లో, వేర్వేరు సమయాల్లో లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము అందుతోంది. కానీ ఇక ముందు దేశవ్యాప్తంగా అందరు లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి పెన్షన్ జమ కానుంది. ఈపీఎఫ్ వోలో నకిలీ ఖాతాలు, ఉపయోగంలోని ఖాతాలను తొలగించడం కోసం కూడా ఈ విధానం పనికొస్తుందని ఈపీఎఫ్ వో వర్గాలు చెబుతున్నాయి.