Telangana: తెలంగాణకు తప్పని వాన ముప్పు.. నేడు, రేపు కూడా అతి భారీ వర్షాలు

Heavy Rains Warning in Telangana Today and Tomorrow

  • అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వానలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
  • జయశంకర్ భూపాలపల్లిలో 35 సెంటీమీటర్ల వర్షం

తెలంగాణకు ఇంకా వాన ముప్పు పొంచే ఉంది. రాష్ట్రంలో నేడు, రేపు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉద్ధృతి నమూనాలను పరిశీలించిన అధికారులు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. 

ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ముసురుపట్టి మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు పడ్డాయి.

నిన్న సాయంత్రం వరకు తెలంగాణలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామంలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బోర ఆదిలక్ష్మి (36) విద్యుదాఘాతంలో మరణించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్‌లో వర్షానికి పెంకుటిల్లు కూలి జయమ్మ (65) మరణించింది. ఏకాదశి పుణ్యస్నానాల కోసం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన 25 మంది భక్తులు బస్సులో కాళేశ్వరం వెళ్లి వస్తుండగా వారి వాహనం వరదలో చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అధికారులు పొక్లెయిన్ సాయంతో బస్సును బయటకు లాగారు. 

రాష్ట్రంలో పలుచోట్ల వాగులు పొంగడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో జులై నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 61 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News