COVID19: ఆందోళన వద్దు.. తెలంగాణలో 3-4 రోజుల్లోనే కోలుకుంటున్న కరోనా రోగులు
- ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పూర్తిగా తగ్గుదల
- గత తొమ్మిది రోజుల్లో 5189 కొత్త కేసుల నమోదు
- ఈ సమయంలో ఒక్క కరోనా మరణం కూడా లేదు
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, కొత్త ఒమిక్రాన్ వేరియంట్ల వల్ల ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య మాత్రం పెరగడం లేదు. వైరస్ వల్ల మరణాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అదే సమయంలో వైరస్ బారిన పడి వాళ్లు మూడు, నాలుగు రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఈ నెల 1 నుంచి 9వ తేదీల మధ్య రాష్ట్రంలో కరోనా కేసులు 481 నుంచి 5,189కి పెరిగాయి. కానీ, ఈ తొమ్మిది రోజుల్లో వైరస్ వల్ల ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. గత మూడు వేవ్ లకు పూర్తి భిన్నంగా ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పూర్తిగా తగ్గింది. వైరస్ బాధితులు ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నారు. కరోనా రెండు, మూడో వేవ్స్ లో రాష్ట్రంలో 80 వేల మందికి పైగా కరోనా రోగులకు చికిత్స అందించిన గాంధీ ఆసుపత్రిలో ఈ మధ్య ఒక్కరు కూడా క్రిటికల్ కేర్ లో చికిత్స తీసుకోకపోవడం గమనార్హం.
‘తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రిలో చేరడం లేదు. ఎవ్వరికీ ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడటం లేదు. వాస్తవానికి, పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులు మూడు-నాలుగు రోజుల్లోనే కోలుకుంటున్నారు. గతంలో డెల్టా, ఒమిక్రాన్ వేవ్ సమయంలో రోగులు కోలుకునేందుకు కనీసం ఒక వారం నుంచి 15 రోజుల సమయం పట్టింది. ఇప్పుడు మూడు రోజుల్లోనే కోలుకోవడం మంచి సంకేతం’ అని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు అన్నారు. కరోనా తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, ఒమిక్రాన్ వేరియంట్‌లు వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయని ఆయన తెలిపారు.