Elon Musk: ఎక్కువ మంది పిల్లల్ని కనే ఉద్యోగులకు ఎలాన్ మస్క్ ప్రోత్సాహకాలు
- వచ్చే నెలలో ప్రకటించనున్నట్టు వెల్లడించిన టెస్లా చీఫ్
- వేతనంతోపాటు భారీగా ప్రోత్సాహకాలకు అవకాశం
- అధిక సంతానానికి మస్క్ అనుకూల వాదన
ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రత్యేక నిర్ణయాలతో ఆయన ఎప్పుడూ ప్రచారంలో ఉంటూ ఉంటారు. తాజాగా చెప్పుకోబోయేది మస్క్ సంతానం ఉపన్యాసాల గురించే. మస్క్ ముగ్గురు భార్యలతో ఇప్పటికే తొమ్మిది మంది సంతానానికి తండ్రి అయ్యాడు. కొంత కాలానికి భూమికి జనాభా కొరత ఏర్పడుతుందని.. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన లోగడ సూచించారు.
తాను చేయడమే కాదు.. మరింత మంది సంతానం దిశగా తన ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నారు మస్క్. ఇందుకోసం వారికి ప్రత్యేక అలవెన్స్ లను పెద్ద మొత్తంలో ఇవ్వనున్నారు. తన కంపెనీలు టెస్లా, ద బోరింగ్ కంపెనీ, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ చిన్న పిల్లలకు ప్రయోజనాలను అమల్లో పెట్టనున్నట్టు మస్క్ ఓ ట్వీట్ చేశారు. వేతనంతోపాటు ఇచ్చే పిల్లల ప్రోత్సాహకాలను గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించారు.
అంతేకాదు మస్క్ ఫౌండేషన్ ద్వారా ఎక్కువ మందిని కనేవారికి సాయం కూడా అందించనున్నట్టు చెప్పారు. చిన్నారులకు సంబంధించి ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాలను వచ్చే నెలలో ప్రకటిస్తామని మస్క్ చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తక్కువ జనాభా సంక్షోభం విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్నానని మస్క్ ట్వీట్ చేయడం గమనార్హం. ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉండబోమన్న దానిపై మీ స్పందన ఏంటని ట్విట్టర్లో ఓ యూజర్ వేసిన ప్రశ్నకు మస్క్ ఇలా స్పందించారు.