Nara Lokesh: ఉత్తరకొరియా నియంత కిమ్ని మించిపోయాడు జగన్: నారా లోకేశ్
- పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్నారన్న లోకేశ్
- ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఎద్దేవా
- అక్కసుతో పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని తొలగించారని విమర్శ
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కు గన్ మెన్లను తొలగించడంపై ఆ పార్టీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉత్తరకొరియా నియంత్ కిమ్ ను మించిపోయారని నారా లోకేశ్ అన్నారు. పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా తనకు తానే ప్రకటించుకున్నారని, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతో పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించారని మండిపడ్డారు. ఇప్పటికే జగన్ ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడించిన కేశవ్ తనకు అదనపు భద్రత కావాలని కోరితే... ఉన్న భద్రతను కూడా తొలగించారని అన్నారు. ఈ కక్ష సాధింపులతో వైసీపీ సర్కారు వేల కోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టేనని చెప్పారు. తక్షణమే కేశవ్ కు గన్ మెన్లను కేటాయించి, సెక్యూరిటీని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.