CPI Narayana: పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ నియామకం చట్టవిరుద్ధం: సీపీఐ నారాయణ
- ఓటింగ్ ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న నారాయణ
- రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని వ్యాఖ్య
- ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక తీర్మానం చెల్లదన్న సీపీఐ నేత
వైసీపీకి జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సీపీఐ నారాయణ మట్లాడుతూ, ఇది చట్ట విరుద్ధమని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గత ప్రజాస్వామ్యం చాలా అవసరమని తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ ద్వారా మాత్రమే అధ్యక్షుడిని కానీ, కార్యవర్గాన్ని కానీ ఎన్నుకోవాలని అన్నారు. ఇదే విషయాన్ని నిబంధనలు కూడా చెపుతున్నాయని తెలిపారు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నిబంధనలను మార్చినప్పుడు ఈసీ నోటీసులిచ్చిందని నారాయణ తెలిపారు. అయితే గతంలో కరుణానిధిని పార్టీ లైఫ్ టైమ్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ డీఎంకే తీర్మానం చేయడాన్ని ఈసీ ఆమోదించడం గమనార్హం.