Narasaraopeta: ఇర్లపాడులో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం... హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ
- నరసరావుపేట సమీపంలోని ఇర్లపాడులో నూతన కేంద్రీయ విద్యాలయం
- ప్రారంభమైన భూమి చదును పనులు
- వీడియోను పోస్ట్ చేసిన స్థానిక ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'కేంద్రీయ విద్యాలయాల'లో సీటు కోసం అన్ని వర్గాల ప్రజలు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. విద్యా బోధనలో అత్యుత్తమంగా రాణిస్తున్న కారణంగానే ఈ విద్యాలయాల్లో ప్రవేశాలకు నానాటికీ డిమాండ్ పెరిగిపోతోంది. ఇలాంటి క్రమంలో ఏపీలో మరో కేంద్రీయ విద్యాలయం అందుబాటులోకి రానుంది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట సమీపంలోని ఇర్లపాడులో ఈ విద్యాలయం నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి.
కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన స్థలంలో భూమి చదును పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పనులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి అనుకూలంగా తగిన కార్యక్రమాలు మొదలయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నానంటూ ఆయన ఆ వీడియోను పోస్ట్ చేశారు.