PM Modi: నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- దేశ రాజధానిలో నూతన పార్లమెంటు భవనాలు
- నూతన పార్లమెంటులోనే వర్షాకాల సమావేశాలు
- పార్లమెంటు సెంట్రల్ హాలుపై జాతీయ చిహ్నం
- కంచుతో తయారైన దీని బరువు 9,500 కిలోలు
ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నూతన భవనాల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, నూతన పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన మూడు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఆవిష్కరించారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణ సందర్భంగా పార్లమెంటులో పనిచేసే సిబ్బందితో మోదీ ముచ్చటించారు. చిహ్నాన్ని నిల్చుని ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు.
ఈ చిహ్నం గురించి అధికారులు వివరాలు తెలిపారు. ఇది కంచుతో తయారైందని, 6.5 మీటర్ల ఎత్తున్న దీని బరువు 9,500 కిలోలు అని వెల్లడించారు. పార్లమెంటు ప్రధాన భవంతి పైభాగాన దీన్ని ఏర్పాటు చేశారని, దీనికి దన్నుగా నిలిపిన ఉక్కు ఆకృతే 6,500 కిలోల వరకు బరువుంటుందని అధికారులు పేర్కొన్నారు.
.