BJP: వైసీపీ మద్దతు అడగలేదన్న సత్యకుమార్... ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి షెకావత్
- ముర్ముకు వైసీపీ మద్దతే అవసరం లేదన్న సత్యకుమార్
- సత్యకుమార్ వ్యాఖ్యల్లో నిజం లేదంటూ షెకావత్ వివరణ
- ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని కోరామని వెల్లడి
- ఈ కారణంగానే ముర్ము నామినేషన్‌కు వైసీపీ పార్లమెంటరీ నేతలు వచ్చారన్న కేంద్ర మంత్రి
తెలుగు నేలకు చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌కు ఆయన సొంత పార్టీకి చెందిన కీలక నేత, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నుంచి భారీ షాక్ ఎదురైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలంటూ తామేమీ వైసీపీని కోరలేదని సత్యకుమార్ అన్నారు. తాము అడగకుండానే వైసీపీ తనంతట తానుగా ముర్ముకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అసలు ద్రౌపది ముర్మును గెలిపించుకునేందుకు తమకు వైసీపీ మద్దతే అవసరం లేదన్న కోణంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ దిశగా సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి రావడంతో షెకావత్ వేగంగా స్పందించారు. సత్యకుమార్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన షెకావత్.. ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైసీపీని కోరలేదనడంలో వాస్తవం లేదని చెప్పారు. ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము కోరామని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే ముర్ము నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వైసీపీ తన పార్లమెంటరీ పార్టీ నేతలను పంపిందని కూడా ఆయన గుర్తు చేశారు.