Gotabaya Rajapaksa: ఇంతకీ.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పుడెక్కడున్నారు?

Where is Gotabaya Rajapaksa

  • తన నివాసం నుంచి వెళ్లిపోయిన గొటబాయ
  • అధ్యక్ష భవనాన్ని ఆక్రమించిన ఆందోళనకారులు
  • ఓ నేవీ స్థావరంలో ఆశ్రయం పొందిన గొటబాయ
  • ఇవాళ కటునాయకే ఎయిర్ బేస్ కు చేరిక
  • దుబాయ్ వెళ్లే అవకాశాలున్నాయంటున్న స్థానిక మీడియా

శ్రీలంకలో కల్లోలభరిత పరిస్థితులకు ఇంకా ముగింపు కార్డు పడలేదు. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియదు. శనివారం నాడు కొలంబోలో వేలమంది నిరసనకారులు అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టడం తెలిసిందే. అంతకుముందు గొటబాయ నేవీ భద్రతా సిబ్బంది సహకారంతో అక్కడ్నించి బయటపడ్డారు. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేదు. 

అయితే, నిన్న విదేశాల నుంచి గ్యాస్ దిగుమతి కాగా, వాటిని ప్రజలకు సజావుగా పంపిణీ చేయాలంటూ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు అందాయి. ఆయన ఎక్కడున్నారన్నది మాత్రం తెలియరాలేదు. 

తాజా సమాచారం ప్రకారం... ఇవాళ కొలంబో విమానాశ్రయానికి సమీపంలోని ఓ ఎయిర్ బేస్ కు గొటబాయ రాజపక్స చేరుకున్నట్టు వెల్లడైంది. ఆయన విదేశాలకు తరలివెళ్లనున్నట్టు తెలుస్తోంది. 73 ఏళ్ల గొటబాయ తన నివాసం నుంచి బయటపడ్డాక ఓ నేవీ స్థావరంలో తలదాచుకున్నట్టు రక్షణ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆ తర్వాత ఆయన, ఆయనకు చెందినవారు రెండు హెలికాప్టర్లలో కొలంబోలోని కటునాయకే ఎయిర్ బేస్ కు చేరుకున్నారని వివరించారు. 

కాగా, శ్రీలంకలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు అధ్యక్ష పదవికి గొటబాయ రాజీనామా చేస్తారని పార్లమెంటు స్పీకర్ మహీంద యాపా అభేవర్ధనే వెల్లడించినా, గొటబాయ తన రాజీనామాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా, అధికారులకు ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా లేరన్న విషయం స్పష్టమవుతోంది. 

ఇక గొటబాయ ఆచూకీపై అధ్యక్ష కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోగా, ఆయన ఈ రాత్రికి దుబాయ్ వెళతారని స్థానిక మీడియా పేర్కొంది. 

కాగా, గొటబాయ ఆచూకీపై తీవ్ర గందరగోళం నెలకొంది. గొటబాయ ఇప్పుడు దేశంలో లేరని, పొరుగునే ఉన్న దేశంలో ఉన్నారని, బుధవారం మళ్లీ శ్రీలంకకు వస్తారని పార్లమెంటు స్పీకర్ ను ఉటంకిస్తూ ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అయితే కాసేపటికే స్పీకర్ మహింద యాపా అభేవర్ధనే తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. తాను ఓ మీడియా సంస్థతో పొరపాటున అలా చెప్పానని వివరణ ఇచ్చారు. అధ్యక్షుడు గొటబాయ దేశంలోనే ఉన్నారని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News