Tollywood: రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెలంగాణ సాయుధ పోరాటంపై కృష్ణవంశీ వెబ్ సిరీస్

Director Krishna vamsi to do web series on Telangana Rebellion

  • ప్రముఖ ఓటీటీ సంస్థలో ఐదు సీజన్లు, 50 ఎపిసోడ్స్ లో రూపొందించేందుకు ప్రణాళిక
  • ప్రస్తుతం ‘రంగమార్తండ’ చిత్రం చేస్తున్న వంశీ
  • ఆ తర్వాత ‘అన్నం’ సినిమాతో ముందుకు

టాలీవుడ్ లో దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. తొలి చిత్రం 'గులాబీ' మొదలు నిన్నే పెళ్లాడతా, సింధూరం, మురారి, ఖడ్గం, చందమామ వరకు గుర్తిండిపోయే సినిమాలు రూపొందించారు. కానీ, 2007లో వచ్చిన చందమామ తర్వాత ఆయన మరో విజయం అందుకోలేకపోయారు. 

ఈ క్రమంలో ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తాండ’ టైటిల్ తో ఆయన కొత్త చిత్రం చేస్తున్నారు. దీనిపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ చిత్రం తర్వాత ‘అన్నం’ అనే మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఇందులో రైతన్నల ఆకలి పోరాటాన్ని ఆవిష్కరించబోతున్నారు. 

ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత కృష్ణవంశీ ఓటీటీలో అడుగు పెట్టనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం కృష్ణవంశీ దేశ చరిత్రలోనే భారీ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో త్వరలోనే ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ఆయన ఈ మధ్య ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తానని వెల్లడించారు.

ఇక తెలంగాణ సాయుధ పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. దీనిపై ఇప్పటిదాకా పలు సినిమాలు వచ్చాయి. అయితే, సుదీర్ఘ కాలం జరిగిన సాయుధ పోరాటంలో కొన్ని ఘట్టాలనే సినిమాల్లో చూపించారు. ఇప్పుడు వెబ్ సిరీస్‌ రూపంలో ఈ పోరాటంలోని అన్ని అంశాలను విడమరచి చెప్పే అవకాశం కృష్ణవంశీకి లభించనుంది. 

ఈ ప్రాజక్టుపై ఆయన ఇప్పటికే పరిశోధన ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 50 ఎపిసోడ్స్ తో ఐదు సీజన్లలో ఈ సిరీస్ తెరకెక్కనుందని సమాచారం.  ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి చేసే ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ వెబ్ సిరీస్ తెలుగులోనే కాకుండా భారత సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా మారనుంది.

  • Loading...

More Telugu News