NDA: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన రద్దు.. కారణమిదే..!
- షెడ్యూల్ ప్రకారం నేడు రాష్ట్రానికి రావాల్సిన ద్రౌపది
- వర్షాల కారణంగా టూర్ రద్దు
- బీజేపీ ప్రజా ప్రతినిధులను ఢిల్లీకి ఆహ్వానించిన ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం నాటి తెలంగాణ పర్యటన రద్దయింది. ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం హైదరాబాద్ రావాల్సి ఉంది. తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా ఆమె ఇక్కడ ప్రచారం నిర్వహించాలని అనుకున్నారు. షెడ్యూల్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగరానికి వస్తున్న ఆమె మూడు, నాలుగు గంటల పాటు ఇక్కడే ఉంటారని బీజేపీ వర్గాలు చెప్పాయి.
ఓ హోటల్లో గిరిజన, ఆదివాసీ వర్గాల నాయకులు, ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతో ద్రౌపది ముర్ము విడివిడిగా సమావేశం అయ్యేలా ప్రణాళిక రచించారు. ఆమెకు ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేశారు. రోడ్ షో కూడా నిర్వహించాలని అనుకున్నారు. అయితే వర్షాల కారణంగా ముర్ము తన టూర్ ను రద్దు చేసుకున్నారు. మొదట ఆమె టూర్ వాయిదా అని బీజేపీ వర్గాలు చెప్పినప్పటికీ, చివరకు ముర్ము తన టూర్ ను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టూర్ రద్దవడంతో తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను ముర్ము ఢిల్లీకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.