Aurangabad: పట్టణం పేరు మార్చడం కోసం రూ.1,000 కోట్లు తగలేస్తారా?: ఔరంగాబాద్ ఎంపీ
- పేరు మార్పుతో ప్రజలకు ఎన్నో కష్టాలన్న ఎంపీ
- వ్యక్తి గుర్తింపునకు పేరు కీలకమని కామెంట్
- ప్రజలు క్యూలో నుంచోవాల్సి వస్తుందన్న అభిప్రాయం
మహారాష్ట్రలోని ప్రముఖ చారిత్రక పట్టణం ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్ గా ఉద్దవ్ థాకరే ఆధ్వర్యంలోని సర్కారు చివరి ఘడియల్లో మార్చింది. దీనిపై ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఇప్పటికే విమర్శించారు. తాజాగా ఈ నిర్ణయం కారణంగా ప్రజలపై పడే భారాన్ని ప్రస్తావించారు.
‘‘కొందరు ప్రతి దానికీ మతం రంగు పులమాలని చూస్తుంటారు. ఇది హిందువులు, ముస్లింలకు సంబంధించినది కాదు. ఒక వ్యక్తి తరచుగా అతడు లేదా ఆమె ఫలానా పట్టణానికి చెందిన వారిగా గుర్తింపునకు నోచుకుంటారు.
పేరు మార్చేందుకు భారీగా ఖర్చు అవుతుంది. చిన్న పట్టణానికి పేరు మార్చడం కోసం రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఓ నివేదిక చదివి తెలుసుకున్నాను. ఔరంగాబాద్ వంటి పట్టణానికి అయితే పేరు మార్పునకు రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని ఢిల్లీ అధికారి ఒకరు తెలిపారు. ఇది కూడా కేవలం ప్రభుత్వ డాక్యుమెంట్లు, ఉత్తర ప్రత్యుత్తరాల్లో పేరు మార్పునకు చేయాల్సిన వ్యయం. ఇది ప్రజల పన్నుల ఆదాయం. అది మీది, నాది’’ అని జలీల్ పేర్కొన్నారు.
ప్రజలు పడే పాట్లను కూడా ప్రస్తావించారు. ‘‘నాకు ఓ షాపు ఉంటే నేను డాక్యుమెంట్ లో పేరును మార్చుకోవాలి. కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలి. ఇందుకోసం ఎవరికి వారే క్యూలో నించోవాలి. ఉద్ధవ్ థాకరే లేదా శరద్ పవార్ లేదా మరో నేత వచ్చి సాయం చేయరు. సామాన్య ప్రజలకు ఇది కష్టం’’ అని వివరించారు.