- మోడిఫైడ్ వెర్షన్ యాప్స్ ను వినియోగించొద్దని సూచన
- ఫోన్లలోని కీలక సమాచారాన్ని కొట్టి వేస్తాయంటూ ప్రకటన
- ఒరిజినల్ వాట్సాప్ లోనే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ రక్షణ
నకిలీ వాట్సాప్ మెస్సేజింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భారత వినియోగదారులకు వాట్సాప్ సూచించింది. వాట్సాప్ మోడిఫైడ్ వెర్షన్ ను వినియోగించొద్దని మెస్సేజింగ్ యాప్ సీఈవో విల్ క్యాత్ కార్ట్ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. వాట్సాప్ మోడిఫైడ్ వెర్షన్ తో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
వాట్సాప్ మాదిరే సేవలను ఆఫర్ చేస్తున్న హానికారక యాప్ లను వాట్సాప్ పరిశోధన బృందం గుర్తించినట్టు చెప్పారు. హేమోడ్స్ అభివృద్ధి చేసిన ‘హే వాట్సాప్’ అనే యాప్ ప్రమాదకరమైనదని క్యాత్ కార్ట్ తెలిపారు. ఈ తరహా యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచించారు. ఈ యాప్స్ కొన్ని కొత్త ఫీచర్లను యూజర్లకు ఆఫర్ చేస్తున్నట్టు తాము గుర్తించామన్నారు. కానీ, ఇది స్కామ్ అని, డౌన్ లోడ్ చేసుకున్నవారి ఫోన్ లోని కీలక సమాచారాన్ని ఈ తరహా యాప్స్ చోరీ చేస్తాయని చెప్పారు.
వాట్సాప్ ఫీచర్లను పోలిన విధంగా నకిలీ, మోడిఫైడ్ వాట్సాప్ వెర్షన్లు మార్కెట్లో ఉన్నాయంటూ వినియోగదారులను అప్రమత్తం చేసింది. అవి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ రక్షణను ఇవ్వవని, ఈ విధమైన రక్షణ కేవలం వాట్సాప్ ఒరిజినల్ వెర్షన్ లోనే లభిస్తుందని స్పష్టత ఇచ్చింది. ఈ నకిలీ వాట్సాప్ వెర్షన్ యాప్ ‘ప్లే స్టోర్’ లో లేదని.. ఇతర సోర్స్ ల ద్వారా డౌన్ లోడ్ చేసుకుంటే నష్టపోతారని వాట్సాప్ హెచ్చరించింది. ఈ తరహా యాప్స్ ను గుర్తించి, బ్లాక్ చేసే విషయంలో తమ ప్రయత్నాలు ఇక ముందూ కొనసాగుతాయని ప్రకటించింది.