TPCC President: విపక్షాలు లేకుండా పార్లమెంటులో కార్యక్రమాలు ఎలా?... లోక్ సభ స్పీకర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
- పార్లమెంటులో జరిగే ప్రతి కార్యక్రమానికి విపక్షాలను పిలుస్తారు కదా అన్న రేవంత్
- అధికార పార్టీ కార్యాలయంగా పార్లమెంటును మార్చరాదని హితవు
- రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత స్పీకర్దేనని వెల్లడి
- పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని మోదీ ఆవిష్కరించడంపై రేవంత్ అభ్యంతరం
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అయితే విపక్షాలకు చెందిన ఒక్క సభ్యుడు కూడా అక్కడ కనిపించలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ టీపీసీసీ చీఫ్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్‌కు మంగళవారం ఓ లేఖ రాశారు.
విపక్షాలకు చెందిన సభ్యులు లేకుండా పార్లమెంటులో కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తన లేఖలో ఓం బిర్లాను ప్రశ్నించారు. పార్లమెంటు భవనంలో ఏ కార్యక్రమం నిర్వహించినా విపక్షాలు, వాటి నేతలను తప్పనిసరిగా ఆహ్వానిస్తారు కదా? అని రేవంత్ అడిగారు. ఈ తరహా సంప్రదాయంతోనే పార్లమెంటు ఔన్నత్యాన్ని కాపాడుతూ వస్తున్నామని కూడా ఆయన తెలిపారు. అధికార పార్టీకి చెందిన కార్యాలయం మాదిరిగా పార్లమెంటును మార్చలేమని, మార్చకూడదని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. అయినా రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మనదని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే... లోక్ సభలో అధికార పార్టీ నేతగా ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ సోమవారమే మస్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ చిహ్నం ఆవిష్కరణలో మోదీ వెనుక లోక్ సభ స్పీకర్ వున్న వైనాన్ని కూడా ప్రస్తావించిన ఓవైసీ... స్పీకర్ ప్రధానికి సబార్డినేట్ ఏమీ కాదని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా మోదీ జాతీయ చిహ్నం ఆవిష్కరణను ప్రశ్నిస్తూ స్పీకర్‌కు లేఖ రాయడం గమనార్హం.