Offbeat: ఒకటా.. రెండా 12,042 పెప్సీ క్యాన్లు పట్టాడు.. గిన్నిస్ బుక్ లోకి ఎక్కేశాడు!
- 1989 నుంచి పెప్సీ క్యాన్ లను సేకరిస్తున్న ఇటలీ ఔత్సాహికుడు
- 1948లో తయారైన వాటి నుంచి ఇప్పటిదాకా.. 81 దేశాలకు చెందిన క్యాన్ల సేకరణ
- త్వరలో వీటితో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తానంటున్న క్రిస్టియన్ కావలెట్టి
- పెద్ద సంఖ్యలో సేకరణతో రికార్డుగా గుర్తించిన గిన్నిస్ బుక్
స్టాంపులు సేకరించడం కొందరికి హాబీ.. వివిధ దేశాలకు చెందిన నాణాలు, కరెన్సీ నోట్లు సేకరించడం మరికొందరికి అలవాటు.. ఖరీదైన పెయింటింగ్ లు, కార్ల వంటి వాటినీ సేకరించేవారు ఉంటారు. కానీ ఇటలీలోని మిలన్ కు చెందిన క్రిస్టియన్ కావలెట్టికి మాత్రం చాలా చిత్రమైన హాబీ ఉంది. అదేమిటో తెలుసా.. తాగి వదిలేసిన పెప్సీ క్యాన్లను సేకరించడం. చీ అదేం హాబీ అంటారా.. అంత మామూలుగా ఏమీ కాదు. ఆయన చాలా ఏళ్లుగా చాలా పెద్ద కలెక్షన్ ను సిద్ధం చేసుకోవడం గమనార్హం. ఆయన సేకరించిన క్యాన్లు ఎన్నో తెలుసా.. ఏకంగా 12,042. దీని వెనుక ఎంతో కృషి, శ్రమ ఉన్నాయి. ఈ సేకరణ గిన్నిస్ బుక్ రికార్డుకు కూడా ఎక్కింది.
32 ఏళ్లుగా సేకరిస్తూ..
కావలెట్టి తన సోదరుడు ఎడోర్డోతో కలిసి 1989లోనే పెప్సీ క్యాన్లను సేకరించడం మొదలుపెట్టాడు. నిజానికి 4,391 క్యాన్లతో 2004 మార్చిలోనే కావలెట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా 12,042 క్యాన్ల కలెక్షన్‌తో మరో రికార్డు నెలకొల్పాడు. ఇందులో అన్ని ఖండాల్లోని 81 దేశాలకు చెందిన వెరైటీ పెప్సీ క్యాన్ లు ఉన్నాయి. ఇన్ని కాన్లను సేకరించడం కాదు.. వాటన్నింటినీ పద్ధతిగా ఒకదాని పక్కన ఒకటి పేర్చి పెట్టడం, ఏది ఎప్పటిదో, దేని ప్రత్యేకత ఏమిటో, ఏ దేశం నుంచి తెచ్చిందో తెలిసేలా నోట్ చేసి పెట్టడం గమనార్హం. ఇందుకైతే ఆయన ఓపికను మెచ్చుకోక తప్పదు.
ఎన్నో ప్రత్యేకతలు కూడా..
- ఎప్పుడో 1948లో మొదటిసారిగా పెప్సీ అమెరికా మార్కెట్లోకి వచ్చినప్పటి క్యాన్ నుంచి ఇప్పుడు వివిధ దేశాల్లో విక్రయిస్తున్న వెరైటీల దాకా అన్ని క్యాన్ లు కావలెట్టి దగ్గర ఉన్నాయి.
- అంతరిక్షంలో తాగి పడేసిన పెప్సీ క్యాన్ కూడా ఆయన దగ్గర ఉంది తెలుసా.. 1980లో అంతరిక్షంలోకి వెళ్లిన అమెరికన్ ఆస్ట్రోనాట్ స్పేస్ క్రాఫ్ట్ లో తాగిన పెప్సీ క్యాన్‌ను కూడా సేకరించి పెట్టుకున్నాడు.
- మొత్తంగా 15 వేల క్యాన్లను సేకరించి, ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు కావలెట్టి చెప్తున్నారు.