Uk: బ్రిటన్ కాబోయే ప్రధాని బెన్ వాలేస్.. ఆకుకూర కాడలతో ‘మిస్టిక్ వెజ్’ జోస్యం!
- బ్రిటన్ లో భవిష్యత్తు ఊహించడంలో పేరు పొందిన జెమీమా పాకింగ్టన్
- ఆస్పరాగస్ కాడలతో పాచికల్లా వేస్తూ భవిష్యత్ ఊహించే తీరుపై ఆసక్తి
- కొన్నిసార్లు ఆమె చెప్పిన అంశాలు నిజం కావడంతో ఇంటర్నెట్ లో విపరీతంగా ఫాలోయింగ్
అది ఒకప్పటి రవి అస్తమించని సామ్రాజ్యానికి నేతృత్వం వహించిన బ్రిటన్ దేశం. కారణమేదైనా గానీ.. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే రాజీనామా చేశారు. మరి కొత్త ప్రధాని ఎవరు అన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో జెమీమా పాకింగ్ టన్ అనే మహిళ సరికొత్త జోస్యంతో తెరపైకి వచ్చింది. యూకేకు కాబోయే ప్రధాని బెన్ వాలేస్ అని ప్రకటించింది. ఓ మహిళ ఏమిటి? బ్రిటన్ ప్రధాని ఎవరో తేల్చేయడం ఏమిటన్న సందేహం రావొచ్చు. కానీ ఆమె యూకేలో ‘మిస్టిక్ వెజ్’ గా పేరెన్నికగన్న జ్యోతిష్యురాలు మరి. అంతేకాదు.. ఆమె జ్యోతిష్యం చెప్పే పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. ఆస్పరాగస్ (ఉల్లికాడల తరహాలో ఉండే) కాడలను పాచికల్లా వేసి ఆమె జోస్యం చెబుతుంది.
ఇంతకుముందూ చాలా సార్లు..
మన దగ్గర చిలక జోస్యం లాగానే యూకేలో జెమీమా పాకింగ్ టన్ చెప్పే ఆస్పరాగస్ జోస్యం బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడే కాదు.. ఇంతకుముందు బోరిస్ జాన్సన్ ప్రధాని అవుతాడని, ప్రిన్స్ ఫిలిప్ చనిపోతాడని, రాయల్ ఫ్యామిలీ నుంచి ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ తప్పుకుంటారని కూడా ఆమె చెప్పింది. అవన్నీ నిజం కావడంతో ఆమె జోస్యానికి బాగా ప్రచారం వచ్చేసింది. ఇప్పుడు ఆమె యూకే ప్రధాని అవుతారని చెబుతున్న బెన్ వాలేస్ ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్నారు.
మరెన్నో జోస్యాలు చెబుతున్నారు
ఆస్పరాగస్ తో జోస్యం చెప్పేది ప్రపంచంలో 66 ఏళ్ల జెమీమా ఒక్కరే. తన ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆమె భవిష్యత్ చెప్పడం మొదలుపెట్టింది. తేయాకు ఆకులతో భవిష్యత్ చెప్పే తన అత్త దగ్గరి నుంచి ఈ జోస్యం నేర్చుకున్నానని ఆమె చెబుతూ ఉంటుంది. ఈమె ఇదే కాదు, ఇంకా చాలా చెబుతున్నారు. బ్రిటన్ లేబర్ పార్టీ నాయకుడిగా సర్ కెయిర్ స్టార్మర్ ఎక్కువ కాలం ఉండబోరని, రాయల్ ఫ్యామిలీ మరింత విషాదం చూడబోతోందని, మరిన్ని అభియోగాలు ఎదుర్కోబోతోందని కూడా ఆమె జోస్యం చెబుతోంది.