Vitamin B12: దీర్ఘకాలం పాటు విటమిన్ బి12 లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...?
- శరీర జీవక్రియలకు కీలకంగా విటమిన్ బి12
- బి12 లోపిస్తే రక్తహీనత
- గుండెపైనా ప్రభావం
- నాడీ వ్యవస్థకు కోలుకోలేనంత నష్టం
మానవ దేహంలోని అనేక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు ఉపకరించే కీలకమైనది విటమిన్ బి12. ఇది ఎర్ర రక్తకణాల తయారీలో తోడ్పాటు అందించడమే కాదు, నాడీ వ్యవస్థను కాపాడుతుంది. అయితే, దీర్ఘకాలంలో ఈ ముఖ్యమైన విటమిన్ లోపిస్తే నాడీ వ్యవస్థకు కోలుకోలేనంతగా నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, విటమిన్ బి12 లోపంతో ప్రభావితమయ్యే అవయవాలలో గుండె కూడా ఒకటని వెల్లడించారు. ఇది లోపించడం వల్ల పల్స్ రేట్ వేగం పెరుగుతుందట.
ఎలాగంటే... విటమిన్ బి12 లోపంతో ఎర్ర రక్తకణాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. దాంతో శరీరానికి తగినంతగా ఆక్సిజన్ అందదు. తద్వారా, గుండెకు తగినంత రక్తప్రసరణ జరగడం కోసం దేహంలో ఉన్న రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఈ చర్య కాస్తా పల్స్ రేటు పెరగడానికి దారితీస్తుంది. విటమిన్ బి12 లోపం తొలుత రక్తహీనతకు, ఆపై గుండె, ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుంది. తీవ్ర రక్తహీనత వల్ల రక్తప్రసరణ రేటు అధికం కావడం, గుండె వైఫల్యం చెందడం సంభవిస్తుంది.
మరో లక్షణం కూడా విటమిన్ బి12 లోపాన్ని వెల్లడిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల చర్మం పాలిపోయినట్టుగా పసుపు రంగులోకి మారుతుంది. నాలుకపైనా, నోట్లోనూ పుండ్లు, నాలుక ఎర్రబారడం, సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, కంటిచూపు మందగించడం, చిరాకు, మానసిక కుంగుబాటు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అవగాహనశక్తి లోపించడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అంతేకాదు, ఆలోచనా విధానాన్ని, అనుభూతి చెందే విధానాన్ని, ప్రవర్తనను కూడా విటమిన్ బి12 లోపం ప్రభావితం చేస్తుందట. అందుకే, విటమిన్ బి12 విషయంలో ఏమాత్రం అలసత్వం చూపరాదని, ఈ విటమిన్ లభ్యమయ్యే ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ బి12 ప్రధానంగా జంతువుల కాలేయాలు, కిడ్నీలు, సార్డైన్ చేపలు, సాల్మన్ చేపలు, గుడ్లు, పాలు, జున్ను వంటి పదార్థాల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక, విటమిన్ బి12ను ఎంత మోతాదులో పొందాలో కూడా నిపుణులు వెల్లడించారు. 19 నుంచి 64 ఏళ్ల లోపు వారికి రోజుకు 1.5 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరమవుతుందట.