Kamareddy District: బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

four dead with current shock in kamareddy

  • కామారెడ్డిలో ఘటన
  • భార్యను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన భర్త
  • వారికేమైందో తెలియక పట్టుకున్న పిల్లలు కూడా మృత్యువాత
  • రూ. 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన మంత్రి వేముల  

ఇనుప తీగపై బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన భర్త, వారిని పట్టుకున్న ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి అనాథగా మిగిలాడు. తెలంగాణలోని కామారెడ్డిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  స్థానిక బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన అహ్మద్ (35)- పర్వీన్(30) భార్యాభర్తలు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న అహ్మద్ దంపతులకు కుమార్తె మహీమ్ (6), కుమారులు ఫైజాన్ (5), అద్నాన్ (3) ఉన్నారు. అందరూ కలిసి ఓ చిన్న రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవు కావడంతో ఫైజాన్ తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, మిగతా వారు ఇంట్లోనే ఉన్నారు.

ఇంట్లోని ఇనుపతీగపై బట్టలు ఆరేస్తుండగా పర్వీన్ ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో అహ్మద్ కూడా ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కుప్పకూలడంతో ఏమైందో అర్థం కాని మహీమ్, అద్నాన్‌లు పెద్దగా కేకలు వేస్తూ వారిని పట్టుకున్నారు. అంతే, వారు కూడా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. పిల్లల అరుపులు విని వచ్చిన చుట్టుపక్కల వారు జరిగిన దారుణం చూసి నిశ్చేష్టులయ్యారు.

వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్కూలుకు సెలవు కావడంతో అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఫైజాన్ అనాథగా మిగిలాడు. పర్వీన్ తండ్రి హకీమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. బాధితులు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున రూ. 3 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News