Telangana: డెంగీ, టైఫాయిడ్ జడలు విప్పుతున్నాయి.. పానీపూరితో జాగ్రత్త: తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు
- రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు
- అత్యధికంగా హైదరాబాద్‌లో 516 కేసుల నమోదు
- ఈ ఏడాది ఇప్పటి వరకు 203 మలేరియా కేసులు
- రాష్ట్రంలో 5 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయన్న డీహెచ్
- అప్రమత్తంగా ఉండాలని సూచన
రాష్ట్రంలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు జడలు విప్పుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 516 కేసులు నమోదైనట్టు చెప్పారు. అలాగే, సంగారెడ్డిలో 97, కరీంనగర్‌లో 84, ఖమ్మంలో 82, మేడ్చల్‌లో 55, మహబూబ్‌నగర్‌లో 54, పెద్దపల్లిలో 40 చొప్పున కేసులు నమోదైనట్టు చెప్పారు.
జూన్‌లోనూ 565 కేసులు నమోదయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 203 మలేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బ్యాక్టీరియా, వైరస్‌ల ప్రభావం పెరుగుతోందని, సీజనల్ వ్యాధులు కూడా చుట్టుముడుతున్నాయని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పానీపూరి లాంటి వాటివల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారినపడుతున్నారని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కరోనా వైరస్ సీజనల్ వ్యాధిలా మారిపోయిందని, అది కూడా జలుబు, జ్వరంలానే ఉండనుందని పేర్కొన్నారు. అయినప్పటికీ అందరూ టీకాలు వేసుకోవాలని గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్టు చెప్పారు. 50 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, తద్వారా కరోనా, క్షయ, జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధుల బారి నుంచి రక్షణ పొందాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు 5 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలన్న డాక్టర్ శ్రీనివాసరావు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణులు ప్రసవం తేదీకంటే ముందే ఆసుపత్రిలో చేరాలని సూచించారు.