fevers: ఈ సీజన్ లో ఐదు జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే..!

 types of fever that can affect you in rainy season apart from Covid

  • బ్యాక్టీరియా, వైరస్ లకు వర్షాకాలం నిలయం
  • సొంత వైద్యంతో ప్రాణాంతకం చేసుకోవద్దని వైద్యుల సూచన
  • డెంగీలో కొన్ని ప్రాణాంతక రకాలు
  • సమస్య కనిపిస్తే వెంటనే చికిత్సకు వెళ్లడమే మంచిది

‘వర్షాకాలం రోగాలకు నిలయం’ అని వైద్యులు అంటుంటారు. సీజనల్ వ్యాధులు వర్షాకాలంలోనే ఎక్కువగా పలకరిస్తాయి. తేమ, చల్లటి వాతావరణం, బ్యాక్టీరియా, వైరస్ లకు అనుకూలం. అవి బలంగా విస్తరించడానికి ఈ వాతావరణం అనుకూలిస్తుంది. అందుకే అవి స్వైర విహారం చేస్తుంటాయి. ఈ కాలంలో జ్వరాలు, నీళ్ల విరేచనాలు, వాంతులు, ఇవన్నీ ఈ కోవలోనికే వస్తాయి. 

అనారోగ్యం వస్తే సొంత వైద్యంతో నిర్లక్ష్యం చేసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వచ్చింది వైరల్ జ్వరమా లేక డెంగీనా, మలేరియా, లేక టైఫాయిడ్ లేక కరోనా జ్వరమా ఎలా తెలిసేది..? సరైన మందులు తీసుకోకపోతే అది మరింత తీవ్ర రూపం దాల్చి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. అందుకని వైద్యులను సంప్రదించడం ద్వారా సరైన చికిత్స లభించి, సత్వరమే కోలుకునేందుకు అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి.

దోమలు కుట్టడం ద్వారా ఈ రుతువులో ఎక్కువ వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వాటిల్లో డెంగీ, మలేరియా, చికున్ గున్యా జ్వరాలు దోమల ద్వారా వచ్చేవే. దోమ తెరలు, దోమ నివారణ చర్యలతో రక్షణ పెంచుకోవచ్చు. 

 డెంగీ జ్వరం
జ్వరం చాలా ఎక్కువగా 102 డిగ్రీలకు పైన నమోదవుతుంది. ఆ సమయంలో తీవ్రమైన కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. అలాగే, ఛాతీ వెనుక  భాగంగా నొప్పి, తల తిరగడం, మూర్ఛ పోవడం, వణుకు రావడం జరుగుతుంది. నిజానికి డెంగీకి ఇంత వరకు ఔషధం కానీ, చికిత్స కానీ కనిపెట్టలేదు. డెంగీ సోకిన వారు శరీరంలో నీటి శాతాన్ని, లవణాలను కోల్పోకుండా కాపాడుకోవడం ముఖ్యం. డెంగీలోనూ పలు రకాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ప్రాణాంతకమైనవిగా హెచ్చరిస్తున్నారు. ముందే గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఏడిస్ ఈజిప్టై అనే దోమ ద్వారా ఇది వ్యాపిస్తుంది. నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. కనుక ఇంటి చుట్టుపక్కల ఎక్కడా నీరు నిలవకుండా చూసుకోవాలి. 

మలేరియా జ్వరం
దోమ కుట్టడం ద్వారా వ్యాపించే జ్వరం. మలేరియా జ్వరంలో చలి, వణుకు ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, వంటి నొప్పులు కూడా కనిపిస్తాయి. సరైన చికిత్స తీసుకోకపోతే మలేరియా కూడా ప్రాణాంతకమే. గిరిజన అటవీ ప్రాంతాల్లో మలేరియా కారణంగా ఎక్కువ మరణాలు నమోదవుతుంటాయి. మలేరియా వల్ల మెదడు దెబ్బతినడం, శ్వాస తీసుకోలేకపోవడం, శరీరంలో అవయవాల వైఫల్యానికి దారితీయవచ్చు. 

చికున్ గున్యా
దోమ కాటు ద్వారా వ్యాపించే మరో రకం జ్వరం ఇది. రోజంతా ఉండదు. జ్వరం వచ్చి పోతుంటుంది. కీళ్ల కదలికలు సాధారణంగా ఉండవు. పట్టుకున్నట్టు, భారంగా, నొప్పిగా మారిపోతాయి. చికిత్స ద్వారా దీన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చు.

 టైఫాయిడ్ జ్వరం
కలుషిత నీరు, ఆహారం ద్వారా వచ్చే జ్వరం ఇది. జ్వరం, కడుపులో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలకు వ్యాపించి ప్రాణాంతకం చేస్తుంది. అందుకుని చికిత్స వెంటనే తీసుకోవాలి. దీనికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బయటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఇంట్లో కూడా వండిన వెంటనే ఆహారం తినేయాలి. నిల్వ పదార్థాలు తినకూడదు. కాచి, చల్లార్చి, వడకట్టిన నీటినే తాగాలి.

వైరల్ జ్వరాలు
జ్వరం వస్తే అది కోవిడ్ వల్లే అనుకోవాల్సిన అవసరం లేదు. లక్షణాలను బట్టి గుర్తించొచ్చు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలే వైరల్ జ్వరాల్లోనూ కనిపిస్తాయి.

  • Loading...

More Telugu News