Bengaluru: ఫేస్ బుక్ పేరుతో షాప్.. వ్యాపారికి రూ.50 వేల జరిమానా
- బెంగళూరు వ్యాపారి వినూత్న ఆలోచన
- ఫేస్ బుక్ ను పోలిన ఫేస్ బేక్ పేరుతో షాప్
- కోర్టులో సవాలు చేసిన ఫేస్ బుక్
- వ్యాపారికి వ్యతిరేకంగా తీర్పు
మనలో ఫేస్ బుక్ గురించి తెలియని వారు ఉండరు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, యావత్ ప్రపంచంతో అనుసంధానించే విశాలమైన సామాజిక మాధ్యమం ఇది. అందుకేనేమో.. అందరికీ తెలిసిన ఫేస్ బుక్ పేరుతో షాప్ పెట్టేస్తే వ్యాపారం జోరుగా ఉంటుందని భావించి ఉంటాడు బెంగళూరుకు చెందిన కన్ఫెక్షనరీ వ్యాపారి నౌఫెల్ మలోల్. చూడగానే ఫేస్ బుక్ అనుకునేలా.. ఫేస్ బేక్ పేరుతో కన్ఫెక్షనరీ షాప్ తెరిచేశాడు. కానీ, ఫేస్ బుక్ సంస్థ మెటా ఊరుకుంటుందా? కోర్టుకు తీసుకెళ్లి లెంపకాయలు వేయించింది.
మెటా దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఫేస్ బేక్ పేరుతో కానీ, ఫేస్ బుక్ ను పోలిన మరో పేరుతో వ్యాపారం చేయకుండా నిషేధం విధించింది. ‘‘ఫేస్ బుక్ అన్నది బాగా తెలిసిన ట్రేడ్ మార్క్. అనుచిత లబ్ధి పొందేందుకే ఫేస్ బేక్ యజమాని ఈ పేరును ఎంపిక చేసుకున్నాడు’’ అని న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కేసులో మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన తర్వాత.. వ్యాపారి నౌఫెల్ మలోల్ తన షాపునకు ఫేస్ బేక్ తీసేసి ఫేస్ కేక్ గా మార్చడాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రతివాది దురుద్దేశ్యం దీనితో స్పష్టమైనట్టు పేర్కొన్నారు. ఫేస్ బుక్, ఫేస్ బేక్ మధ్య వ్యత్యాసం ఉన్నా, చూడ్డానికి ఒకే మాదిరిగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. వ్యాపారికి రూ.50,000 జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.