Vijayashanti: ఢిల్లీ సంగతి సరే... ముందు గల్లీలో మీ పరిస్థితి చూసుకోండి: సీఎం కేసీఆర్ పై విజయశాంతి విమర్శనాస్త్రాలు
- కేసీఆర్ చెబుతున్న గొప్పలు గప్పాలని తేలిపోయిందన్న విజయశాంతి
- ఇక సెలవు చెప్పే సమయం ఆసన్నమైందని వెల్లడి
- సీఎంల జాబితాలో కేసీఆర్ 11వ స్థానంలో ఉన్నారని వివరణ
- ఇంటికి పోవడం ఖాయమని స్పష్టీకరణ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ సారూ... ఢిల్లీ సంగతి సరే, ముందు గల్లీలో మీ పరిస్థితి చూసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. యావత్ భారతదేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని మీరు చెబుతున్న గొప్పలు గప్పాలని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.
'ఇప్పటిదాకా రాష్ట్రాన్ని ఉద్ధరించానని, ఇకపై దేశాన్ని ఉద్ధరిస్తారంటూ జాతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారు... కానీ, మీ పాలన ఇక చాలని సెలవు చెప్పే సమయం కూడా ఆసన్నమైందని సెంటర్ ఫర్ నేషనల్ ఓపీనియన్ సర్వే ద్వారా స్పష్టమవుతోంది' అని విజయశాంతి వెల్లడించారు.
ప్రజాదరణ పొందుతున్న ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో 11వ స్థానంలో ఉన్న మీకు రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు ఏమాత్రం లేదంటూ స్పష్టం చేశారు. 'ఎలాగూ ఇంటికిపోవడం ఖాయమైంది, అధికారంలో ఉన్న ఈ నాలుగు రోజులైనా ప్రజాసేవ చేయండి... శేష జీవితం ప్రశాంతంగా గడపడానికి దోహదపడుతుంది' అంటూ విజయశాంతి హితవు పలికారు.