Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ఇన్ఫీ మూర్తి అల్లుడు!... తొలి రౌండ్ ఓట్లలో మెజారిటీ సునాక్‌దే!
- బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా
- కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ మొదలు
- కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎంపికైన నేతకే ప్రధాని పీఠం
- తొలి రౌండ్ ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు సాధించిన రిషి సునాక్
- ఓటింగ్ నుంచి ఇద్దరు అభ్యర్థుల అవుట్
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి జరుగుతున్న ఓటింగ్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్ దూసుకుపోతున్నారు. వివాదంలో చిక్కుకున్న ఎంపీకి మంత్రి పదవిని ఇచ్చి ఇరకాటంలో చిక్కుకున్న బోరిస్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార కన్జర్వేటివ్ పార్టీ నేతగా కొత్త నేతను ఎన్నుకునేందుకు ఆ పార్టీలో బుధవారం ఓటింగ్ ప్రారంభమైంది. పార్టీ నేతగా ఎన్నికయ్యే నేతనే బ్రిటన్ ప్రధాని పీఠం వరించనుంది.
బుధవారం రాత్రి 9 గంటలకు ముగిసిన తొలి రౌండ్ ఓట్లలో రిషి సునాక్‌కు అత్యధికంగా 8 ఓట్లు వచ్చాయి. ప్రధాని పదవి రేసులో రిషి సునాక్‌తో పాటు బరిలో నిలిచిన మోర్డాంట్‌కు 67 ఓట్లు రాగా.. ట్రస్‌కు 50 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న నధిమ్ జహవి, మాజీ మంత్రి జెరెమీ హంట్‌లు ఏకంగా రేసు నుంచే తొలగిపోయారు. ఫలితంగా బరిలో నిలిచిన వారిలో రిషి సునాక్‌కు అత్యధిక ఓట్లు దక్కడంతో ప్రధాని పదవి రేసులో అందరికంటే ముందు ఆయనే నిలిచారు.