Virat Kohli: కోహ్లీయే తన సక్సెస్ మార్గాన్ని కనుగొనాలి: గంగూలీ
- అతడు ఓ గొప్ప ఆటగాడన్న బీసీసీఐ సారథి
- అంతర్జాతీయ గణాంకాలే ఈ విషయాన్ని చెబుతున్నాయని వ్యాఖ్య
- మళ్లీ ఫామ్ లోకి వచ్చి మంచిగా ఆడాలన్న ఆకాంక్ష వ్యక్తీకరణ
అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు మాజీ సారథి, స్టార్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీకి, బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ మద్దతుగా మాట్లాడారు. 2019 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయాడు. ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇంగ్లండ్ సిరీసుల్లో అతడికి అవకాశం ఇస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లీని వెనకేసుకొస్తుండడం తెలిసిందే.
‘‘అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ గణాంకాలు చూడండి. సామర్థ్యం, ప్రతిభ లేకుండా అవి సాధ్యం కావు. ఇప్పుడతను క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడనేది నిజమే. ఆ విషయం కోహ్లీకి కూడా తెలుసు. అతడు మాత్రం గొప్ప ఆటగాడు. తనకున్న ప్రతిభా పాటవాల మేరకు రాణించడం లేదన్నది అతడికి కూడా తెలుసు. అతడు తిరిగి ఫామ్ లోకి వచ్చి మంచిగా ఆడాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ, అతడు తనదైన మార్గాన్ని కనుగొని, గత 12-13 ఏళ్ల కెరీర్ మాదిరే సక్సెస్ సాధించాల్సి ఉంది’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
కపిల్ దేవ్ సైతం.. కోహ్లీ పరుగులు సాధించలేకపోతే, అతడిని టీ20ల నుంచి సాగనంపి, యువ ఆటగాళ్లకు చోటు ఇవ్వడంలో తప్పు లేదని వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనికి, 'కపిల్ దేవ్ కి ఏం తెలుసు..? టీమిండియా లోపల ఏం జరుగుతుందో?' అని రోహిత్ శర్మ గట్టిగా బదులిచ్చాడు. జట్టు అవసరాల మేరకు ఆటగాళ్లకు అవకాశమిస్తామని తేల్చి చెప్పడం తెలిసిందే.