Bill Gates: 20 బిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించిన బిల్ గేట్స్
- సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత చేయూత
- ప్రస్తుత సంక్షోభంలో మరింత చేయాల్సిన అవసరం ఉందన్న గేట్స్
- తన నిర్వహణలోని ఫౌండేషన్ ద్వారా వినియోగం
ప్రపంచంలోని టాప్ -10 ధనవంతుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ మరో విడత 20 బిలియన్ డాలర్లను సమాజం కోసం విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. తన మాజీ భార్య మిలిందా ఫ్రెంచ్ గేట్స్ తో కలసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’కు ఈ మొత్తాన్ని బిల్ గేట్స్ విరాళంగా ఇచ్చారు. ఈ వివరాలను తన వ్యక్తిగత బ్లాగ్ లో గేట్స్ బుధవారం ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఇది కూడా ఒకటి. బిల్ గేట్స్ తాజా విరాళంతో 2026 నాటికి ఈ స్వచ్ఛంద సంస్థ వార్షికంగా చేసే ఖర్చు 9 బిలియన్ డాలర్లుగా (రూ.70వేల కోట్లు) ఉండనుంది. ఫౌండేషన్ నిర్వహణలోని నిధులు 70 బిలియన్ డాలర్లకు చేరతాయి. వారెన్ బఫెట్ సైతం గతంలో 3.1 బిలియన్ డాలర్లను ఈ ఫౌండేషన్ కోసం ఇచ్చారు.
‘‘మన కాలంలో వచ్చిన ఈ అతి పెద్ద సంక్షోభ సమయంలో మనమంతా మరింత చేయూతనందించాలి’' అని గేట్స్ పేర్కొన్నారు. కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగిపోయినందున (కరెన్సీ విలువ క్షీణత) బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున నిర్వహిస్తున్న ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు మరింత వెచ్చించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.