YSRCP: గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి: విజయసాయిరెడ్డి
- శ్రీలంక వదిలి పరారైన అధ్యక్షుడు గొటబాయ
- గొటబాయ ఉదంతాన్ని ఉటంకిస్తూ చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లు
- సింగపూర్‌లో చంద్రబాబు ఓ హోటల్‌నే కొన్నారని ఆరోపణ
- అక్కడికి వెళ్లేందుకు ప్రైవేట్ జెట్‌ను రెడీగా పెట్టుకున్నారప్న సాయిరెడ్డి
ఆర్థిక సంక్షభంలో చిక్కుకున్న దేశాన్ని, దేశ ప్రజలను వదిలేసి విదేశాలకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఉదంతాన్ని పోలుస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2024 తర్వాత గొటబాయ మాదిరిగానే ఏపీని వదలనున్న చంద్రబాబు... గొటబాయ మాదిరే సింగపూర్ చేరుకుంటారని ఆయన ఆరోపించారు.
ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ సంధించారు. ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారని, సింగపూర్‌లో ఓ హోటల్ కొనుక్కున్నారని ఆ ట్వీట్లో సాయిరెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ జెట్‌ను రెడీగా పెట్టుకున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయిలా 2024 తర్వాత ఈ 'గొట్టం బాబు'కీ అదే పరిస్థితి అన్న సాయిరెడ్డి... ఇద్దరి చివరి మజిలీ సింగపూరేనంటూ సెటైర్ సంధించారు.