Chandrababu: 525కి పైగా గ్రామాలు అస్తవ్యస్తమయ్యాయి.. ప్రభుత్వం ఆదమరచి నిద్రపోతోంది: చంద్రబాబు

YSRCP govt failed in flood rescue operations says Chandrababu

  • గోదావరి వరదలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారన్న బాబు 
  • యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారని విమర్శ 
  • బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపు 

భారీ వర్షాలు, వరదలతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదమరిచి నిద్రపోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525కి పైగా గ్రామాల్లో ప్రజల జీవనం అస్తవ్యస్తమయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే చిన్న సూచన కూడా వారికి ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. తగిన సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని చెప్పారు. 

రాష్ట్రంలో పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందుగానే తెలియజేసే సాంకేతిక వ్యవస్థను గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని చంద్రబాబు అన్నారు. వరదలపై ఆయా గ్రామాల ప్రజల మొబైల్ ఫోన్ లకు రియల్ టైమ్ లో వరద సమాచారం పంపి, వారిని అప్రమత్తం చేసేలా టెక్నాలజీని పాలనతో మిళితం చేశామని చెప్పారు. 

ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరింపజేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తక్షణ సాయం అందించే వాళ్లమని తెలిపారు. అయితే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని... ఆనాటి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. యంత్రాంగాన్ని నడిపించాల్సిన పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వరద బాధితులకు అండగా నిలిచి సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల డిమాండ్లపై రాజకీయ విమర్శలతో కాలయాపన చేయకుండా ప్రజలను ఆదుకునే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News