Rupee: మరో చారిత్రక కనిష్ఠానికి రూపాయి.. ఎలక్ట్రానిక్ వస్తువులు, నూనెల ధరలు పెరిగే చాన్స్!

Rupee to another historic low Chances of price increase of electronic goods and oil

  • డాలర్ తో మారకంలో రూ.79.90కి పడిపోయిన రూపాయి
  • దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు చేసే క్రమంలో ఎక్కువ రూపాయలు కట్టాల్సిన పరిస్థితి
  • మొత్తంగా దేశానికి దిగుమతుల బిల్లు పెరిగే అవకాశం

డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా రూ.79.90 పైసలకు పడిపోయింది. ముందటి నుంచీ రూ.80 వరకు పడిపోవచ్చన్న అంచనాలకు అనుగుణంగానే రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్ తో మారకం విలువ రూ.79.72 పైసల వద్ద ప్రారంభం కాగా.. ఒక దశలో 79.92 పైసల వరకు పడిపోయింది. చివరికి రూ.79.90 పైసల వద్ద ముగిసింది. నిజానికి చమురు ధరలు తగ్గడం కొంత వరకు రూపాయి పతనాన్ని అడ్డుకున్నాయని, లేకుంటే మరింతగా పడిపోయేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. చమురు ధర గురువారం 2.2 శాతం పడిపోయి.. 97.38 డాలర్లకు చేరిందని వివరించారు.

ఆరు నెలల్లో 27 సార్లు పతనం
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రూపాయి 27 సార్లు పతనమైనట్టు ఆర్థిక నిపుణులు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.74కు కాస్త అటూ ఇటుగా కొనసాగగా.. ప్రస్తుతం రూ.80కి చేరువలోకి వచ్చింది. అంటే సుమారు 9.1శాతం పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు.  

దిగుమతులపై మరింత భారం
భారతదేశం చమురుతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట నూనెలను భారీగా దిగుమతి చేసుకుంటుంది. వాటన్నింటికీ డాలర్లలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం పడిపోవడంతో.. మరిన్ని ఎక్కువ రూపాయలు ఖర్చు కానున్నాయి. దీనితో ఆయా ఉత్పత్తుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, వంట నూనెలు, ప్యాకేజ్ చేసిన ఆహార పదార్థాలు, విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య వంటి వాటికి ఎక్కువగా ఖర్చవుతుందని వివరిస్తున్నారు.

  • Loading...

More Telugu News