Corona Virus: నాజల్ స్ప్రేతో 24 గంటల్లోనే 94 శాతం తగ్గిపోతున్న కరోనా వైరల్ లోడ్
- నాజల్ స్ప్రేను ఉత్పత్తి చేస్తున్న గ్లెన్ మార్క్
- ఫ్యాబీస్ప్రే పేరుతో ఫిబ్రవరిలో లాంచ్ చేసిన ఫార్మా దిగ్గజం
- ఈ స్ప్రేతో మూడు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకునే అవకాశం
ముక్కు ద్వారా చేసుకునే స్ప్రేను వాడటం ద్వారా ఎక్కువ రిస్క్ ఉన్న కరోనా పేషెంట్లలో వైరల్ లోడ్ ను 24 గంటల్లో 94 శాతం, 48 గంటల్లో 99 శాతం తగ్గించినట్టు లాన్సెట్ అధ్యయనంలో తేలింది. ఫేజ్ 3 ట్రయల్స్ లో ఈ ఫలితాలను సాధించినట్టు రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏసియా జర్నల్ లో ప్రచురితమైన కథనంలో లాన్సెట్ పేర్కొంది. ముంబై కేంద్రంగా పనిచేసే గ్లెన్ మార్క్ కంపెనీ ఈ ట్రయల్స్ ను నిర్వహించినట్టు లాన్సెట్ తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకున్న, వేయించుకోని ఇరు వర్గాలకు చెందిన 306 మందికి నైట్రిక్ ఆక్సైడ్ స్ప్రేను ముక్కు ద్వారా గ్లెన్ మార్క్ వేసింది. దేశ వ్యాప్తంగా 20 క్లినికల్ సైట్స్ లో ప్రయోగాలు జరిగాయి.
ఏడు రోజుల పాటు ఈ ప్రయోగాలను నిర్వహించారు. ప్రతి రోజు ఆరు సార్లు, ముక్కు ఒక్కో రంధ్రంలో రెండు స్ప్రేల చొప్పున ఏడు రోజుల పాటు స్ప్రే చేశారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల కేసులు పెరుగుతున్న సమయంలో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. హై రిస్క్ పేషెంట్లలో ఈ నాజిల్ స్ప్రే వల్ల 24 గంటల్లోనే వైరల్ లోడ్ గణనీయంగా తగ్గిందని తేలింది. 24 గంటల్లో 93.7 శాతం వైరల్ లోడ్, 48 గంటల్లో 99 శాతం లోడ్ తగ్గిందని లాన్సెట్ తెలిపింది.
ఈ మహమ్మారి ఉద్ధృతి సమయంలో కోవిడ్ ను నియంత్రించేందుకు ఈ థెరపీ చాలా ఉపయోగపడుతుందని గ్లెన్ మార్క్ క్లినికల్ డెవలప్ మెంట్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోనికా టాండన్ తెలిపారు. ఈ నాజల్ స్ప్రే ఫ్యాబీస్ప్రే పేరుతో ఫిబ్రవరిలో ఇండియాలో లాంచ్ అయింది. మన ముక్కు రంధ్రాల్లోకి ప్రవేశించే వైరస్ ను నైట్రిక్ ఆక్సైడ్ అడ్డుకుని, చంపేస్తుంది. దీనివల్ల పేషెంట్లలో గణనీయంగా వైరల్ లోడ్ తగ్గిపోతుంది. ఈ స్ప్రేను వాడితే మూడు రోజుల్లోనే కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉందని టాండన్ చెప్పారు. ఇతర చికిత్సలతో కోలుకునేందుకు కనీసం ఏడు రోజులు పడుతుందని తెలిపారు.