Jamir: జమీర్ మరణం బాధాకరం.. మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు
- మంగళవారం వరద వార్తల కవరేజీకి వెళ్లిన రిపోర్టర్ జమీర్
- శుక్రవారం ఉదయం కారు, మృతదేహం లభ్యం
- జమీర్ కుటుంబానికి చంద్రబాబునాయుడు సానుభూతి
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో వరదలో గల్లంతైన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ జమీర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం ప్రకటించారు. వార్తల సేకరణ కోసం వెళ్లే మీడియా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో వరద వార్తల సేకరణకు వెళ్లి వరదల్లో గల్లంతైన ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ జమీర్ మరణం బాధాకరం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జమీర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విపత్తుల సమయంలో వార్తా సేకరణకు వెళ్లే మీడియా ప్రతినిధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను..” అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 12న జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి వరదల కవరేజికి వెళ్లిన జమీర్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఈ రోజు అతని కారును, మృతదేహాన్ని వాగు సమీపంలోని పొదల్లో గుర్తించారు.