Andhra Pradesh: నోటీసులు ఇస్తే సీఐడీ విచారణకు రావడానికి అభ్యంతరం లేదు: దేవినేని ఉమ
- తన పేరిట ఫేక్ ట్వీట్లు చేస్తున్నారని దేవినేని ఫిర్యాదు
- మంత్రి రాంబాబుపై పోలీసుకు ఫిర్యాదు చేసిన దేవినేని
- ఫోన్ చేసి విచారణకు రమ్మంటున్నారంటూ దేవినేని ఆగ్రహం
- ఫిర్యాదుదారుడినైన తననెలా విచారణకు పిలుస్తారని నిలదీత
ఏపీ సీఐడీ అధికారులు వరుసగా ఫోన్లు చేస్తూ విచారణకు రావాలంటూ కోరడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శుక్రవారం ఘాటుగా స్పందించారు. అయినా ఫిర్యాదు చేసింది తాను అయితే... తననే విచారణకు ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తన ఫిర్యాదు ఆధారంగా ముందుగా మంత్రి అంబటి రాంబాబును విచారించి అరెస్ట్ చేయాలని, ఆ తర్వాత తన వాంగ్మూలం అవసరమైతే.. చట్ట ప్రకారం నోటీసులు ఇస్తే విచారణకు రావడానికి తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు.
తన పేరిట అంబటి రాంబాబు ఫేక్ ట్వీట్లు చేశారని గతంలో ఏపీ సీఐడీ అధికారులకు దేవినేని ఉమ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సీఐడీ అధికారుల నుంచి దేవినేనికి వరుసగా ఫోన్లు వచ్చాయట. ఈ వ్యవహారంపై మీడియాకు దేవినేని వివరాలు వెల్లడించగా... నోటీసులు ఇచ్చాకే దేవినేనిని విచారణకు పిలుస్తామంటూ సీఐడీ అధికారులు తెలిపారు.